ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ అలాగే లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెంపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు దిశగా అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. పెంపు జరుగుతుందంటూ ఆయా రాజకీయ పార్టీలు ముందస్తు సన్నాహాలు చేసుకోవడం కూడా చూశాం. కానీ, ఏళ్ళు గడుస్తున్నాయ్.. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు జరగడంలేదు. ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ (తెలంగాణ) రేవంత్ రెడ్డి, కేంద్రాన్ని ప్రశ్నిస్తే, 2026 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ అలాగే లోక్ సభ నియోజకవర్గాల పెంపు వుంటుందనీ, అప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ పెంపు జరుగుతుందని కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది.
అంటే, ఈ విషయంలో కూడా విభజన చట్టాన్ని కేంద్రం తుంగలో తొక్కిందని అనుకోవాలేమో. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ విషయంలోనూ కేంద్రం, విభజన చట్టాన్ని అనుసరించి ముందుకు నడవడంలేదన్న విమర్శలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చెరో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ, ఏడేళ్ళు గడిచినా అలాంటి ఆలోచన కేంద్రం చెయ్యలేదు. చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి ఇలాంటివి చెప్పుకోడానికి. కేంద్రం ఇలా మొండికేయడానికి తెలుగు రాష్ట్రాల్లోని అంతర్గత రాజకీయాలే కారణమన్న విమర్శలు లేకపోలేదు. 2026 జనాభా లెక్కల తర్వాత.. అంటే, దానికి చాలా సమయం వుంది. 2024 ఎన్నికల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేదన్న విషయం స్పష్టమవడంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు డీలాపడుతున్నాయి.