విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో జనసేన మాజీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైకోర్టు, అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం, స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం జరిగినట్లు వెల్లడించింది. ఇలాంటి కీలకమైన నిర్ణయాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవనీ, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే ఇందుకు నిదర్శనమని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. విశాఖ ఉక్కు పరిశ్రమ, 30 మందికి పైగా ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో తెలుగు నేలకు దక్కింది కొన్ని దశాబ్దాల క్రితం. ప్రైవేటు పరిశ్రమలకు గనులు కేటాయిస్తున్న కేంద్రం, ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కుకి సరైన గనులు కేటాయించడంలో విఫలమవుతూ వస్తోంది.
స్టీలు ప్లాంటు నష్టాల్లో వుందనే సాకు చూపుతూ, ప్లాంటుని అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చింది కేంద్రం. కాగా, కరోనా సెకెండ్ వేవ్ సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమలోని ఆక్సిజన్ ప్లాంట్ దేశమంతటికీ ఆక్సిజన్ సరఫరా చేసిన విషయాన్ని ఎలా విస్మరించగలం. ఎన్నో వేల, లక్షల ప్రాణాలు కాపాడిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఆయువు తీయాలని కేంద్రం చూస్తుండడం శోచనీయం. తన చేతిలో అధికారం వుంది గనుక, బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసేసుకుని, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలంటూ వాటిల్లో కోర్టులు సైతం జోక్యం చేసుకోలేవని చెప్పడం హాస్యాస్పదం కాక మేమిటి.? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక, దేశంలో కీలక రంగాల్ని అమ్మకానికి పెట్టేసిన వైనం కళ్ళ ముందుకు కనిపిస్తూనే వుంది. ఇప్పటికి ఇలా.. ముందు ముందు దేశంలో ఇంకెన్ని రంగాలు అమ్మకాలకు గురవుతాయోగానీ.. క్యాబినెట్ నిర్ణయాల పేరుతో దేశం మొత్తాన్ని గంప గుత్తగా అమ్మేసే అధికారం కూడా తమకే వుందని కమల నాథులు నినదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.