భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ రెండు విధానాలను పాటిస్తుంటుంది. బలం లేకపోతే పక్కవాడి చేతులు పట్టుకుని పైకి లేవడం, లేదా అన్నీ సరిగా ఉంటే ఎదుటివారిని తొక్కుకుంటూ వెళ్లిపోవడం. ఇవే బీజేపీకి తెలిసింది. ఒక్కోసారి వీటిని మిళితం చేస్తుంది కూడ. అంటే ఎవరి చేతినైతే పట్టుకుని బలం తెచ్చుకుంటుందో వాళ్లనే మింగేయడం. ఈ పద్దతి చాలా ప్రమాదకరం. ఈ పద్దితివే ఆంధ్రాలో ప్రయోగిస్తోంది. 2024 నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని అనుకుంటోంది. అందుకే ఎన్నడూ లేని విధంగా ఏపీలో పార్టీని బలోపేతం చేసే పని మొదలుపెట్టింది. మొదటగా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించి పార్టీ ప్రక్షాళన పనులు స్టార్ట్ చేశారు.
డబుల్ గేమ్ ఇదే మరి:
పథకంలో భాగంగా వైఎస్ జగన్ తో తెర వెనుక స్నేహం చేస్తున్నారు. ఈ స్నేహం ఎలా ఉంటుంది అంటే ఏపీలో బీజేపీ లీడర్లు జగన్ మీద మతం పేరుతో ఆరోపణలు, ఆందోళనలు చేస్తుంటే కేంద్రంలో మోదీ మాత్రం పాలన బాగుంది, కీప్ ఇట్ అప్ అంటూ భుజం తడుతుంటారు. రాష్ట్రంలో ప్రతిపక్షం మేమే అనిపించుకోవడానికి తిట్లు, పైన బిల్లులు పాస్ చేయించుకోవడంలో మద్దతు కోసం అక్షింతలు. ఈ అక్షింతలు, తిట్ల వెనక మరో బలమైన స్కెచ్ కనిపించకుండానే నడిచిపోతోంది. అదే పార్టీ బలోపేతం. ఏపీలో బీజేపీకి చెప్పుకోదగిన లీడర్లు అంటే ముగ్గురో నలుగురో అంతే. ఇప్పుడు వారినే బలమైన నేతలుగా చిత్రీకరించే పనిలో ఉంది.
కొత్త పదవులు :
అందులో భాగంగానే బీజేపీ కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన నూతన కార్యవర్గం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కార్యవర్గం అంటే పవర్ఫుల్ టీమ్ అనే అనాలి. వారికి పార్టీలో మంచి గుర్తింపు కీలక బాధ్యతలు ఉంటాయి. ఏపీ నుండి ఈ కార్యవర్గంలో ఇద్దరికి చోటు ఇచ్చారు. మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఇంతకుముందు జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ను అదే పదవిలో కొనసాగించడం. వీరిద్దరూ పేరుకు జాతీయ స్థాయిలో పనులు చేయాల్సి ఉన్నా ఎక్కువగా మాత్రం ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారు.
కుర్చీయే లక్ష్యం:
ఇప్పటికే వీరికి రాష్ట్రంలో ఎలా పనిచేయాలి అనే విషయమై ఖచ్చితమైన బ్లూ ప్రింట్ అందే ఉంటుంది. ఇక వీరు పాలక వర్గంలో అసంతృప్తులను వెతకడం, అవసరమైతే రఘురామకృష్ణరాజు లాంటి వారిని తయారుచేయడం, టీడీపీని వెనక్కు నెట్టి బీజేపీని ప్రొజెక్ట్ చేయడం, సామాజికవర్గాల వారీగా రాజకీయం నెరపడం, 2024కి అభ్యర్థులను తయారుచేసుకోవడం లాంటి ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. బీజేపీ ప్రస్తుతం చేస్తున్న పనులు, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న కార్యాలను చూస్తే సీఎం పీఠాన్ని జగన్ కింద నుండి లాగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అర్థమవుతోంది. కాబట్టి జగన్ మరింత అప్రమత్తతో ఉండాలి.