ప్రధాని మోడీ ఏ పని చేసిన ఖచ్చితంగా అందులో ఆయన మార్క్ ఉంటుంది, అందరి రాజకీయ నాయకులకంటే భిన్నంగా వ్యవహరించటం మోడీ నైజం. చాలా మంది చిన్న విషయాలుగా పరిగణించే వాటిని మోడీ మాత్రం చాలా సున్నితంగా పరిశీలించి, అక్కడ తన మార్క్ చూపిస్తూ వుంటారు.
తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ మీద పని చేస్తూ.. ఉత్తమ ఫలితాల్ని నమోదు చేస్తున్న భారత బయోటెక్ సంస్థను సందర్శించారు ప్రధాని. హైదరాబాద్ తో పాటు.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్.. ఫుణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ లోనూ ఆయన పర్యటించారు. కోవిడ్ వ్యాక్సిన్ మీద పరిశోధనలు చేస్తూ.. చివరి దశలో ఉన్న వేళ.. ప్రధాని స్వయంగా పర్యటించటంతో ఈ మూడు పరిశోధక సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయని చెప్పాలి.
నిజానికి ఈ పర్యటన అనేది ఒక రోజు ముందుగానే ఖరారు అయ్యిదంటే నిజం షాక్ అనే చెప్పాలి. పైగా ఒక పరిశోధనకు సంబంధించి ఒక ప్రైవేటు కంపెనీని దేశ ప్రధానమంత్రి ప్రత్యేకంగా పర్యటించటం ఇదే తొలిసారి అవుతుందేమో? కరోనా లాంటి అరుదైన సందర్భం కావటంతో ఈ పర్యటనను అర్థం చేసుకోవచ్చు. భారత బయోటెక్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలను కలవటంతో పాటు.. వ్యాక్సిన్ పరిశోధనలపై వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ శాస్త్రవేత్తల్ని ఆయన అభినందించారు.
ఇక ఆ సంస్థ నుండి బయటకు వచ్చి హకీంపేట విమానాశ్రయానికి వెళుతున్న వేళ తన వాహన శ్రేణిని ఆపారు. కారు దిగిన మోడీ.. కాస్త దూరంలో మీడియా ప్రతినిధులను చూసి అభివాదం చేశారు. కారు దిగి ఇరవై అడుగులు వేసి.. మీడియాను పలుకరిస్తున్నట్లుగా పలుకరించి.. వెళ్లిపోయారు. ఒకదశలో.. ఆయనే మీడియా వద్దకు స్వయంగా వస్తారని భావించినా.. అలాంటిదేమీ లేకుండా.. చేతులు ఊపి వెళ్లిపోయారు. ఇది ఖచ్చితంగా మోడీ మార్క్ అనే చెప్పాలి.
సాధారణంగా ప్రధాని స్థాయిలో ఉన్న నేత మీడియా కోసం తన వాహన శ్రేణిని ఆపేయటం అనేది జరిగే పని కాదు. ప్రధాని ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ముందుగా మీడియా పాయింట్ ఏర్పాటు చేసి కేవలం అక్కడే మాట్లాడటం జరుగుతుంది. అయితే హైదరాబాద్ పర్యటనలో మోడీ మీడియాతో మాట్లాడకపోయినా వాళ్ల కోసం ప్రత్యేకంగా ఆగి, అభివాదం చేయటం విశేషం