సాధారణంగా అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు ప్రతిపక్షంతో గొడవలుపడి వార్తల్లో నిలుస్తుంటారు. ప్రభుత్వానికి, పాలనకు సంబంధించిన విషయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలతో హైలెట్ అవుతుంటారు. కానీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం వ్యక్తిగత వ్యవహారాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరి నోళ్ళలో నానుతున్నారు. అది కూడ ఇద్దరు వ్యక్తుల మూలాన కావడం, ఆ ఇద్దరూ ఒకప్పుడు వైసీపీలో ఉన్నవారే కావడం చర్చనీయాంశమవుతోంది. మొదట్లో పేకాట కల్బ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే మీద ఆరోపణలు గుప్పుమన్నాయి. నిర్వాహకులు ఆమె అనుచరులే కావడంతో వివాదం ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. ఎలాగో ఆ వివాదం సద్దుమణిగింది.
ఈలోపు అక్రమ మద్యం తరలింపు వ్యవహారం వెలుగుచూసింది. అందులోనూ శ్రీదేవి అనుచరుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. దీంతో ఆమె పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సందీప్, సురేష్ అనే ఇద్దరు యువకుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరే తన మీద కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చారు శ్రీదేవి. వారిద్దరూ సస్పెండ్ అయిన వెంటనే ఒక పోలీస్ అధికారితో ఆమె దురుసుగా మాట్లాడిన ఫోన్ సంభాషణలు బయటికొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు డాక్టర్ శ్రీదేవి ఎన్నికల సమయంలో ఖర్చు కోసం ఒక భారీ మొత్తంలో తన వద్ద అప్పు తీసుకుందని, అందులో కొంత మొత్తం తిరిగి ఇచ్చినా ఇంకా చాలా ఇవాల్సి ఉందని, అడిగితే బెదిరిస్తున్నారని, పోలీసులతో కేసు పెట్టించి లోపల వేయిస్తానని బెదిరించినట్టు మేకల రవి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు సందీప్ అనే వ్యక్తి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇమ్మనందుకు ఎమ్మెల్యే నుండి తనకు ప్రాణహాని ఉందని అంటూ సెల్ఫీ వీడియో వదిలాడు. శ్రీదేవిగారి వాయిస్ అంటూ కొన్ని ఆడియో క్లిప్పులు కూడ బయటికొచ్చాయి. దీంతో ఎమ్మెల్యేనే బయటికొచ్చి అది తన వాయిస్ కాదని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు సందీప్, సురేష్ తన మీద పగబట్టారని, వారి నుండి తనకు ప్రాణహాని ఉందని, ఈ వ్యవహారం వెనుక ఒక పెద్ద లీడర్ ఉన్నాడంటూ చెప్పుకొచ్చారు. మొదటి నుండి ఈ ఇద్దరు వ్యక్తులతో శ్రీదేవికి నడుస్తున్న వివాదాన్ని గమనిస్తే అడుగడుగునా ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు స్ఫష్టంగా అర్థమవుతోంది. పార్టీలో మామూలు కార్యకర్తల్లా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం చూస్తే ఈ వ్యవహారం వెనుక పెద్ద తలలే ఉన్నాయనే అనుమానం కలగక మానదు.