పవ‌న్‌ది కక్షట..ఇంత గొప్పగా ఎలా ఆలోచిస్తారు రోజాగారు

ఎమెల్యే రోజాగారు చేసే విమర్శలకు విలువ లేకుండా పోయి చాలా కాలమే అయింది.  పాలసీలు మాట్లాడటం, సరైన వివరణలు ఇవ్వడం అస్సలు అలవాటు లేని రోజాగారు ఎంతసేపూ ఏమోషనల్ మాటలు మాట్లాడటం, సినిమాటిక్ తరహా విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు.  ఆమె మాటల్లో ఎమోషన్ ఉంటుంది తప్ప రీజనింగ్ ఉండదనేది చాలా మంది మాట.  తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజాగారు చేసిన విమర్శలు అలాగే ఉన్నాయి.  రాజధానిని అమరావతిని నుండి తొలగించడం మీద పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  గుంటూరు, క్రిష్ణా జిల్లాల వైసీపీ నేతలకి చిత్తశుద్ది ఉంటే వెంటనే రాజీనామాలు చేసి రైతుల తరపున పోరాడాలని సవాల్ విసిరారు.  ఈ సవాల్ వైసీపీ నేతలకు గట్టిగానే తగిలినట్టుంది. 
 
అందుకే రోజాగారు డిఫెన్స్ ప్రక్రియలో భాగంగా పవన్ మాటలకి విపరీత అర్థాలు వెతికేశారు.  గత ఎనికల్లో పవన్ ను గాజువాక ప్రజలు తిరస్కరించారని కక్ష పెంచుకున్న పవన్ విశాఖలో రాజధాని ఉండకూడదని అంటున్నారని అనుమానంగా ఉన్నట్టు స్టెట్మెంట్ ఇచ్చారు.  గాజువాకలో పవ‌న్‌ను ఓడించడానికి ఎవరు ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలుసు.  స్వయంగా వైసీపీ ఎంపీనే ఈ విషయాన్ని రివీల్ చేశారు.  ఇప్పుడే రాష్ట్రం ఏర్పడి విశాఖ జిల్లానే రాజధానిగా ప్రతిపాదించి ఉండి, దానికి  పవన్ విశాఖలో రాజధాని ఉండకూడదని అడ్డుపడితే కక్ష పెంచుకున్నారని అనుకోవచ్చు.  కానీ గత ఐదేళ్లు అమరావతినే రాజధానిగా ప్రొజెక్ట్ చేసి, రైతుల నుండి వేల ఎకరాలు సేకరించి, అక్కడి ప్రజల్లో ఆశలు రేకెత్తించింది గత ప్రభుత్వం.  ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ ఆ రాజధానిని కాదని మూడు రాజధానుల విధానాన్ని అమలు చేస్తోంది.  
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన సభ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉంటే తమకు సమ్మతమేనని చెప్పి, ఎన్నికల ప్రచారంలో అసలు 3 క్యాపిటల్స్ ఊసే ఎత్తకుండా ఇప్పటికిప్పుడు రాజధానిని మార్చేశారు.  ఈ మార్పు రాజ్యాంగానికి అనుగుణంగానే ఉన్నా మార్చాల్సిన అవసరం ఏమిటో ఇప్పటికీ సరిగ్గా చెప్పలేకపోతోంది వైసీపీ.  అసలు ఈ మార్పు వెనక అవసరం కంటే అహం ఉందనే వాదన వినిపిస్తోంది.  అమరావతి కట్టడం పూర్తైతే దాని మీద చంద్రబాబు మార్క్ సుస్పష్టంగా ఉంటుంది.  అదెప్పటికీ పోదు.  అది వైఎస్ జగన్ కు ఇష్టం లేదని అందుకే అమరావతిని కాదంటున్నారని చాలా మంది అభిప్రాయం.  ఈ అభిప్రాయాన్ని వాస్తవం అనలేం కానీ రోజాగారు ఆలోచించినట్టే ఆలోచిస్తే మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజమనే అనాలి.  దాన్ని మూర్ఖత్వంగానే చూడాలి.  కానీ అందరూ రోజాగారంత గొప్పగా ఆలోచించలేరు కదా.