గత కొన్ని రోజుల నుంచి సానియా మీర్జా గురించి వార్తలు వస్తున్నాయి. వికారాబాద్ అడవుల్లో ఉన్న తన ఫామ్ హౌస్ లో కాల్పులు జరిగాయని.. ఆ కాల్పుల్లో ఒక ఆవు చనిపోయిందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. అక్కడ కాల్పులు జరిపింది ఎవరో కాదు.. సానియా మీర్జా అంటూ కూడా వార్తలు వచ్చాయి. సానియా మీర్జానే కాల్పులు జరపడం వల్ల ఆవు చనిపోయిందని.. అక్కడి గ్రామస్తులు చెబుతున్నారని.. తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఆరోపించారు.
వికారాబాద్ జిల్లాలోని దామగుండలో సానియా మీర్జాకు ఫామ్ హౌస్ ఉంది. ఇండియాకు వచ్చినప్పుడు సానియా ఎక్కువగా అక్కడే ఉంటుంది. ఈనేపథ్యంలో ఇటీవల తన ఫామ్ హౌస్ లో ఓ ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా కూడా ఉందంటూ రాజాసింగ్ ఆరోపణలు చేస్తున్నారు.
గతంలో సానియా మీర్జా.. ఓ నెమలిని కూడా చంపినట్టు గ్రామస్తులు తెలిపారని.. ఎమ్మెల్యే ఆరోపించారు. ఆవుపై కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
అయితే.. ఈ కాల్పుల ఘటనపై ఇప్పటికే సానియా మీర్జా ఫామ్ హౌస్ ఇన్ చార్జ్ ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సానియా ఫామ్ హౌస్ కు మేతకు వచ్చిన ఓ ఆవును తుపాకీతో ఉమర్ కాల్చి చంపాడన్న ఆరోపణలతో ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చింది.. అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో రాజాసింగ్.. సానియా మీర్జాపై సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.