ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇందులో నలంద కిషోర్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంపీ విజసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావుపై వచ్చిన రాజకీయ పోస్టులను ఫార్వార్డ్ చేసిన కారణంగానే సీఐడీ పోలీసులు ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. అయితే నలంద కిషోర్ విశాఖ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ విషయం గంటాకు తెలియడంతో హుటాహుటిన విశాఖలో పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు.
ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులతో గంటా వాగ్వివాదానికి తిగినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై గంటా తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. కిషోర్ చేసింది దేశ ద్రోహమా? రక్షణ వ్యవహారాల రహస్యాలు శత్రు దేశానికి అందించాడా? అరెస్ట్ చేసారా? అని మండిప డ్డారు. డైలీ వందల మెసేజ్ లో సోషల్ మీడియాలో షేర్ అవుతుంటాయి. ప్రతీ ఒక్కరు షేర్ చేస్తూనే ఉంటారు. కిషోర్ కూడా అలాగే చేసి ఉంటాడు. అతను పంపించిన మెసేజ్ లో కూడా ఎక్కడా వ్యక్తులు పేర్లు లేవు. అయినా పోలీసులు అర్ధరాత్రి మప్టీలో వచ్చి అరెస్ట్ చేసారు. నాపై ఏదైనా వుంటే నా సన్నిహితులను ఇబ్బంది పెడతారా? అని గంటా పోలీస్ లపై నిప్పులు చెరిగారు.
గత కొన్ని రోజులుగా టీడీపీ నేతల అరెస్టులు వరుసగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అవినీతి అక్రమాల కింద ఒక్కో నాయకుడు జైలుకెళ్తున్నాడు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి లు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ లు అన్ని అక్రమంగా చేసినవంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా మండిపడ్డారు. కానీ అదే పార్టీకి చెందిన గంటా మాత్రం ఈ అరెస్ట్ లపై పెద్దగా స్వరం వినిపంచలేదు. అయితే నలంద కిషోర్ గంటా బీనామీగా పేరుగాంచడంతో గంటాకు సంబంధించిన వివరాలు ఏవైనా కూపీ లాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశమైంది.