పవన్ కళ్యాణ్ నోరు జారితే, జనసేన పార్టీకి నష్టం. అదే, టీడీపీ నేతలు నోరు జారితే.. ఆ పార్టీకి నష్టం. అధికార వైసీపీ నేతలు నోరు జారితే.. వైసీపీకి రాజకీయంగా నష్టం. అదే, ఓ మంత్రి నోరు జారితే.. ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వం, ప్రజల దృష్టిలో పలచనైపోతుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. విపక్షాలకు చెందిన నేతలు హద్దులు దాటి విమర్శలు చేస్తే, దానికి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు కాకుండా, వైసీపీకి చెందిన ఇతర నేతల్ని రంగంలోకి దించొచ్చు. కానీ, కొడాలి నాని.. పేర్ని నాని.. ఇలా మంత్రులు నేరుగా రంగంలోకి దూకేయడం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది. విపక్షాల విమర్శలకు ప్రభుత్వం తరఫున మంత్రులు సమాధానం గట్టిగానే ఇవ్వొచ్చు. కానీ, సభ్యత మరచిపోతే ఎలా.? పవన్ కళ్యాణ్.. తన విమర్శల్లో పేర్ని నాని పేరు నేరుగా ప్రస్తావనకు తీసుకురాకుండా ‘సన్నాసి’ అని ఎగతాళి చేసిన మాట వాస్తవం.
టిట్ ఫర్ టాట్.. అన్న రీతిలో ‘సన్నాసి’ అనే పదాన్నే పవన్ మీద పేర్ని నాని ప్రయోగించడం వరకూ తప్పు పట్టలేం. కానీ, అంతకు మించి.. సభ్యత మరిచిపోయారు పేర్ని నాని. ‘పవన్ కళ్యాణ్‌కి ధీటైన కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని..’ అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో, పేర్ని నాని అసభ్యకరమైన మాటలు.. అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలూ ఇలాగే వైరల్ అయ్యాయి. మంత్రులు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. అవి ప్రభుత్వాధినేతకు చెడ్డపేరు తెస్తాయన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పాలనా వ్యవహారాల్లో బిజీగా వుంటారు. ఇలాంటి విషయాల్లో మంత్రుల్ని ఆయన వారించే పరిస్థితి వుండకపోవచ్చు. మంత్రులే, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా సభ్యత, సంస్కారాలు ప్రదర్శించాల్సి వుంటుంది.