దుబ్బాక ఉప ఎన్నికల పోరు ముగిసింది. చివరకు దుబ్బాక ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. అయితే.. చాలామంది అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీని దుబ్బాక ప్రజలు ఓడించారు. బీజేపీకే పట్టం కట్టారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకే ఓట్లు గుద్దేశారు. దీంతో ఆయన విజయకేతనం ఎగురవేశారు. 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలవగా… రెండో స్థానంలో టీఆర్ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచాయి.
అయితే.. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై మాట్లాడిన కేటీఆర్.. ఈ ఫలితాలతో తాము మరింత అప్రమత్తమవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఫలితాలు తమను మరింత అప్రమత్తం చేశాయన్నారు.
2014 నుంచి మొన్నటి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే తాము విజయాలకు పొంగి పోమని.. అలాగే అపజయాలకు కూడా కుంగిపోమని ఆయన స్పష్టం చేశారు.
మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. అయితే.. ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఎందుకు ఫలితాలు తమకు అనుకూలంగా రాలేదో… తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటాం. పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు మేము ముందుకు సాగుతాం.. అని చాలా తక్కువ సమయంలోనే ముగించేశారు కేటీఆర్.