ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి తెలుసు కదా. ఆయనకు కొంచెం కోపం ఎక్కువ. ఎదుటివారు ఎవరైనా సరే.. వెంటనే తనకు కోపం వస్తే మాత్రం ఆగరు. ఎక్కేస్తారు.
తాజాగా ఓ విషయంపై కూడా సీరియస్ అయ్యారు మంత్రి అనిల్. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరెండెంట్ నిర్లక్ష్యంపై ఆయన బాగానే ఫైర్ అయ్యారు.
కరోనా విషయంలో నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఉన్నదని.. కరోనా రోగులను అక్కడ పట్టించుకోవడం లేదని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి కదా.. ఈ నేపథ్యంలోనే మంత్రి అనిల్ .. నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం నిధులు ఇస్తున్నా కూడా… ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నా కూడా.. కరోనా విషయంలో ఎందుకు ఆసుపత్రి నిర్లక్ష్యం వహిస్తోందంటూ సూపరిండెంట్ పై ఫైర్ అయ్యారు. అందరు అధికారుల ముందే ఆయన్ను మంత్రి నిలదీశారు.
నెల్లూరు లోని నూతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో కరోనాపై జరిగిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా సూపరిండెంట్ సుధాకర్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు.. కోవూరు ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తవు. అసలు ఏంది నీ బాధ. నీవల్ల మేము ఎన్నో మాటలు పడాల్సి వస్తోంది. కరోనాతో ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఆసుపత్రికి నిధులు ఇచ్చినా కూడా కరోనా రోగులకు ఎందుకు సౌకర్యాలను కల్పించడం లేదు.. అంటూ మంత్రి సుధాకర్ రెడ్డిని నిలదీశారు.
ఇప్పటికైనా కరోనా రోగులకు సరైన వైద్య చికిత్సలు అందించి.. వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలంటూ మంత్రి ఆదేశించారు.