Minister Ambati’s : పోలవరం ప్రాజెక్టు విషయమై చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎంత మేర పూర్తయ్యింది.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పనులు ఎలా జరుగుతున్నాయి.? అన్నదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రచ్చ ఏ స్థాయిలో జరుగుతోందో నిత్యం చూస్తూనే వున్నాం.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లెక్కలు చెప్పాల్సింది కేంద్రం. ఆ ప్రాజెక్టుకి నిధులు కేటాయించాల్సిందనీ, ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిందీ కేంద్రమే. ఆ కేంద్రాన్ని తెలుగు మీడియా నిలదీయలేని దుస్థితి. నిలదీయడానికి, కేంద్ర మంత్రులెవరూ రాష్ట్రానికి రారు.. వచ్చినాగానీ, మీడియా నిలదీసే పరిస్థితి లేదు.. నిలదీసినా సమాధానం చెప్పేంత ఓపిక కేంద్రానికి లేదు.
‘మేమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం..’ అని ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చంద్రబాబు చెప్పినా, అదే మాట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చెప్పినా.. అదంతా హంబక్.! నిజమే మరి, జాతీయ ప్రాజెక్టుని రాష్ట్రం పూర్తి చేయడమేంటి.? ఈ మాత్రం ఆలోచన ఏపీ ప్రజలకు లేకపోవడంతోనే అధికారంలో వున్న పార్టీలు ఇలా ఆటలాడుతున్నాయి.
ఏపీ జలవనరుల శాఖ తాజా మంత్రి అంబటి రాంబాబు, పోలవరం ప్రాజెక్టు విషయమై మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. పైగా, ఈనాడుకి ఒకలా, ఆంధ్రజ్యోతికి మరోలా, ఇంకో మీడియాకి ఇంకోలా సమాధానమిస్తానంటూ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. ఆ ప్రాజెక్టు పేరుతో ఇంత రాజకీయమా.? ఇంత అసమర్థ పరిపాలనా.?