ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని ప్రకటించారోగానీ, అప్పటినుంచే వైసీపీ ప్రజా ప్రతినిథులకు తిప్పలు మొదలయ్యాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజల ఛీత్కారాలెలా వున్నాయో తమ ప్రజా ప్రతినిథులకు తెలియజేయాలనే సంకల్పంతోనే అధినేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారేమో.. అనిపించకమానదు.
మంత్రి అంబటి రాంబాబు, తాను ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజల దగ్గరకు వెళ్ళబోతున్నాననీ, ప్రజలు తమ ప్రభుత్వం పట్ల ఎంత సానుకూలంగా వున్నారో చూపిస్తానంటూ టీడీపీ అనుకూల మీడియాకి సవాల్ విసిరారు.!
ప్చ్.. అంబటినీ జనం వదల్లేదు. సమస్యల చిట్టాతో కడిగి పారేశారు. అంబటి రాంబాబు, గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనం వద్దకు వెళినప్పుడు ఎదురైన పరిస్థితి ఇది. అనుచరుల్ని వెంటేసుకుని, భద్రతా సిబ్బంది సాయంతో జనం వద్దకు వెళ్ళారు అంబటి.
తిట్ల దండకాలు, ఛీత్కారాలు.. వెరసి మంత్రి అంబటి రాంబాబు చేపట్టిన ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమం రసాబాసగా మారిపోయింది. చేసేది లేక మంత్రి అంబటి విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
అక్కడా ఇక్కడా అన్న తేడాల్లేవ్.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ ప్రజా ప్రతినిథులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ వ్యతిరేకతతో 175 సీట్ల సంగతి దేవుడెరుగు, అందులో సగం సీట్లైనా వైసీపీకి వస్తాయా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.