ఎంఐఎం పార్టీ పేరు చెబితే వినొచ్చే పేరు హైదరాబాద్. అవును.. ఆ పార్టీని స్థాపించింది అక్కడే కానీ.. ప్రస్తుతం ఆ పార్టీ దేశమంతా విస్తరించే యోచనలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎంపీలు కూడా ఉన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ పార్టీ ఏపీ వైపు చూస్తోంది. అవును.. ఏపీలోనూ చాలామంది ముస్లింలు ఉన్నారు. ముస్లింల ఓట్ల కీలకంగా ఉన్న నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏపీలో ముస్లింలకు సంబంధించిన పార్టీలేవీ లేవు. అందుకే.. ఎంఐఎం తమ నెక్స్ ట్ టార్గెట్ ను ఏపీగా పెట్టుకుందట.
ఇప్పటికే బీహార్ ఎన్నికల్లోనూ పోటీ చేసి… అక్కడ ఐదు సీట్లలో గెలుపొందింది ఎంఐఎం పార్టీ. త్వరలో రానున్న పశ్చిమ బెంగాల్, యూపీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమైపోతోంది పార్టీ. అందుకే.. మరో తెలుగు రాష్ట్రమయిన ఏపీలోనూ పాగా వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే.. ఏపీలో ఎన్నికలు ఇప్పుడు లేవు కానీ.. 2024 దాకా ఆగాలి. అప్పటి దాకా ఆగినా సరే… 2024 వరకు ఏపీలో బలంగా తయారవ్వాలనేది ఎంఐఎం ప్లాన్. అయితే.. ఇక్కడ ఉన్న మరో కిటుకు ఏంటంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మిత్రులు. అందుకే.. గత ఎన్నికల్లో ఎంఐఎం ఏపీలో పోటీ చేయలేదు.
కేవలం జగన్ తో మంచి స్నేహబంధాలు ఉన్నాయన్న కారణంతో ఏపీలో తమకు పట్టు ఉన్న నియోజకవర్గాలను ఎందుకు వదులుకోవాలి? అన్న ఆలోచనలో ప్రస్తుతం ఎంఐఎం పార్టీ ఉందట. ఏపీలోని ఎంఐఎం నేతలు కూడా చాలారోజుల నుంచి ఏపీలో పోటీ చేయాలంటూ పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంఐఎం సన్నాహాలు చేస్తోంది.
అయితే.. ఈ విషయం జగన్ వద్దకు కూడా వెళ్లిందట. దీంతో ఏపీలో ఎంఐఎంకు చెక్ పెట్టడం కోసం వైఎస్ జగన్ బిగ్ ప్లానే వేస్తున్నారట. ముస్లిం మైనారిటీ వర్గాలను తానే ఆదుకుంటున్నానని.. వాళ్లకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ఇంకా కావాలంటే వాళ్లకు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి.. ముస్లిం వర్గాలను వైసీపీ నుంచి దూరం కాకుండా చేయాలన్న బిగ్ ప్లాన్ లో జగన్ ఉన్నారట. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏపీలో ఏం జరగబోతుందో?