టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతుండడంతో వారి అభిమానులు బిక్కమొఖం పెడుతున్నారు. ఇప్పటికే కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకోగా, మెగా ప్రిన్సెస్ నిహారిక తన ప్రియుడు చైతన్యతో డిసెంబర్ 9న పెళ్లి పీటలెక్కింది. అందాల భామ సమంతకు కూడా ఇప్పటికే పెళ్ళైన విషయం తెలిసిందే. ఇక మరి కొద్ది రోజులలో కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించి మహానుభావుడు, రాజా ది గ్రేట్, నోటా, ఎఫ్-2 చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మెహరీన్ కౌర్ పెళ్లి పీటలెక్కబోతుంది.
మెహరీన్ కౌర్ హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో మార్చి 13న జైపూర్ అలీలాకోటలో నిశ్చితార్థం జరుపుకోనుంది. ఇప్పటికే ఆ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నారని సమాచారం. అయితే మెహరీన్ తన పెళ్లికి సంబంధించి సంతోషం వ్యక్తం చేస్తుండగా, పెళ్లి వేడుక ఎప్పుడు ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ రోజు మెహరీన్‌కు కాబోయే భర్త భవ్య బర్త్ డే కావడంతో ఆయనకు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో భవ్య, మెహరీన్‌లకు సంబంధించిన ఫొటో తెగ హల్‌చల్ చేస్తుంది. అయితే మెహ్రీన్ పోస్ట్‌కు భవ్య కూడా స్పందించారు. దేవుడు పంపిన వ్యక్తికి థ్యాంక్యు అంటూ మెహ్రీన్ పోస్ట్‌కి భవ్య కామెంట్ పెట్టారు. కాగా వీరిద్దరు గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, మెహ్రీన్ ఎఫ్3 సినిమాతో త్వరలో పలకరించనుండగా, దీని తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం కానున్నట్టు తెలుస్తుంది.