మెగాస్టార్ చిరంజీవి అభిమానులు వేరు, మెగా కాంపౌండ్‌లోని ఆయా హీరోలకున్న అభిమానులు వేరని అనగలమా.? ఇప్పుడు నమ్మాల్సిందే.. అలా అనుకోవాల్సిందే. ఎందుకంటే, మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కతాటిపైకి వచ్చామంటూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో మీటింగ్ పెట్టుకుని మరీ ప్రకటించుకున్నారట.
తామంతా జనసైనికుల్లా పని చేస్తామని మెగా అభిమానులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారట. సో, ఈ రీ-యూనియన్ జనసేన పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే, దాని వల్ల కలిగే ఉపయోగం ఎంత.? అన్నది ముందు ముందు తేలాల్సి వుంది.
మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక వుందన్న విషయం, ఈ తాజా రీ యూనియన్ వ్యవహారంతో తేటతెల్లమైపోయింది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా చాలామందే వున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్.. ఇలా లిస్టు చాలా చాలా పెద్దదే.
అయితే, మెగా అభిమానుల మధ్య రాజకీయాలు షురూ అయ్యాయ్. పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో కొందరు పెట్టిన చిచ్చు అది. అల్లు అర్జున్ అభిమానుల పేరుతో ఇంకొందరు ఆ మంటలో పెట్రోల్ చల్లారు. అలా మెగా అభిమానుల్ని పవన్, అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో కొన్ని శక్తులు విడదీశాయన్నది నిర్వివాదాంశం.
ఈ కుట్రల వల్ల తాము నష్టపోయామని కాస్త లేటుగా అభిమానులు తెలుసుకున్నట్టున్నారు. బహుశా ‘ఆచార్య’ ఫెయిల్యూర్ వల్ల కలిగిన జ్ఞానోదయమేమో ఇది.! మరి, ఈ జ్ఞానోదయం ఎంతవరకు జనసేనకు సత్ఫలితాలనిస్తుంది.? మెగా కాంపౌండ్ సినిమాలకు ఎంత మేర ఉపయోగపడుతుంది.? వేచి చూడాల్సిందే.