మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇకపై రాజకీయాల గురించి ఆలోచించబోనని గతంలోనూ చెప్పారు, పదే పదే ఈ విషయమై ఎవరు ప్రశ్నించినా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ బల్లగుద్ది చెప్పేస్తున్నారు కూడా.!
కానీ, చిరంజీవి ఇంకా తమ పార్టీకి చెందిన నాయకుడేనన్న భ్రమల్లో వుంది కాంగ్రెస్ పార్టీ. త్వరలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలు జరుగుతాయ్. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం, కొన్ని ఐడీ కార్డుల్ని కాంగ్రెస్ ముఖ్య నాయకులకు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవికి కూడా ఓ ఐడీ కార్డు పంపింది కాంగ్రెస్ అధిష్టానం.
దాంతో, ‘చిరంజీవి మావాడే’ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మద్దతివ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క బీజేపీ కూడా చిరంజీవిని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
జనసేన తరఫున అయినాగానీ, రాజకీయాల్లోకి వచ్చి బీజేపీకి మద్దతిస్తే.. అంటూ రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవుల్ని కూడా బీజేపీ ఆఫర్ చేస్తున్న విషయం విదితమే. అదే సమయంలో వైసీపీ కూడా ఆయనకు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది.. జరుగుతూనే వుందింకా.
ఇంకోపక్క ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో ‘నేను రాజకీయానికి దూరమైనా, నన్ను రాజకీయం వెంటాడుతూనే వుంది..’ అన్నట్లుగా ఓ డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్‌ని సినిమా డైలాగులా కాకుండా, ట్విట్టర్‌లో వదిలారు చిరంజీవి. ఆ వెంటనే, ఇదిగో.. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఐడీ కార్డు వచ్చింది.
ఏదిఏమైనా,మెగాస్టార్ టైమింగే టైమింగు.. అనుకోవాలేమో.! అంతేనా, లేదంటే కాంగ్రెస్ కక్కుర్తి అనుకోవాలా.?