‘కరోనా వైరస్ బారిన పడ్డారా.? అయితే, ఆక్సిజన్ కోసం ఈ నెంబర్ ప్రయత్నించి చూడండి.. రెమిడిసివిర్ ఇంజక్షన్ కోసం వీరిని సంప్రదించండి.. వైద్య సహాయం కోసం ఫలానా నెంబర్ సంప్రదించండి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టింగ్స్ చూస్తున్నాం. ఫేస్ బుక్, ట్విట్టర్.. ఇలా దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికలపైనా ఇటీవలి కాలంలో ఈ ‘సాయం’ ఎక్కువగానే కనిపిస్తోంది. ప్లాస్మా దగ్గర్నుంచి చాలా విషయాల్లో నెటిజన్లు, బాధితులకీ.. బాధిత కుటుంబాలకీ సాయం అందిస్తున్నారు. ధన సహాయం కూడా అందుతోంది కొందరికి. సాటి మనిషికి సాయం చేయడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది.? కానీ, మెడికల్ మాఫియా కథ వేరు. చావుతో వ్యాపారం చేసేవాళ్ళకి, ప్రాణం విలువ ఏం తెలుస్తుంది.? కరోనా చికిత్స కోసం వాడుతున్న రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్ ఇప్పుడు సరిగ్గా దొరకడంలేదు. చిత్రమేంటంటే, ప్రభుత్వాలు నిర్దేశించిన ధరకి మాత్రమే దొరకడంలేదు.
అంతకు మించిన ధర అయితే, దొరుకుతోంది. అదెలా సాధ్యం.? అంటే అదంతే. తయారీ సంస్థల నుంచి ‘బ్లాక్ మార్కెట్’లోకి రెమిడిసివిర్ వెళ్ళిపోతోందంటేనే, తెరవెనుక పెద్ద తలకాయలు మాఫియా నడుపుతున్నారని అర్థం. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఛాన్సే లేదు. సుమారు 2 వేల నుంచి 3 వేల రూపాయల ధరలో దొరికే రెమిడిసివిర్ (ఒక డోసు) సుమారుగా 20 నుంచి 30 వేల రూపాయల ధర పలుకుతోంది. అవసరాన్ని బట్టి, ఈ ధర 40 వేలు, ఆ పైన కూడా పలుకుతోంది. దాంతో, రెమిడిసివిర్ కోసం బాధిత కుటుంబాలు నానా పాట్లూ పడాల్సి వస్తోంది. ఇంతకీ, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? బ్లాక్ మార్కెట్ దిశగా రెమిడిసివిర్ ఎలా వెళ్ళగలుగుతోంది.? ఇది మొదటి వేవ్ కాదు.. రెండో వేవ్. అయినా, ప్రభుత్వాలు సర్వసన్నద్ధంగా వుండలేకపోయాయంటే, ప్రజారోగ్యం పట్ల పాలకులకు ఎంత చిత్తశుద్ధి వుందో అర్థం చేసుకోవచ్చు.