అమరావతి రాజధానిగా వద్దు, మూడు రాజధానుల విధానాన్ని అమలుచేస్తాం అనడంతో భూములిచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన తెలుపుతున్నారు. రోజురోజుకూ అమరావతి రద్దును కాదనేవారు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. పైగా కోర్టుల్లో సైతం రైతులకు అనుగుణంగానే తీర్పులొస్తున్నాయి. రాజధానిని విశాఖకు తరలించడం, రాజధాని భూములను పేదలకు ఇళ్ల పట్టాల కింద ఇవ్వడం మీద హైకోర్టు స్టే విధించింది. ఇది ప్రభుత్వానికి తీవ్ర అసహనాన్ని కలిగించింది. పైకోర్టుకు వెళ్లినా అనుకూల తీర్పు రాకపోవడంతో అసహనం కాస్త కోపంగా మారింది. రాజధాని మార్పు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని జగన్ పట్టుబట్టుకుని కూర్చున్నారు.
ఇలాంటి తరుణంలోనే మంత్రి కొడాలి నాని బయటికొచ్చి అసలు అమరావతిలో శాసన రాజధాని అయినా ఎందుకుండాలి. అవసరం లేదు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నప్పుడు రాజధాని కావాలని ఎలా అడుగుతారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళామని, ఆయన కూడ మిగతావారితో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు నాని అన్నారు. అది విన్న రైతులు, అమరావతి మద్దతుదారులు ఎంత దారుణం, కనీసం శాసన రాజధాని కూడ ఉంచరా. ఇది జగన్ మనసులోని మాట. మెల్లగా నాని ద్వారా బయటపెట్టించారు. అమరావతిని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోంది అంటూ మండిపడుతున్నారు.
కానీ ఇంకొందరు మాత్రం ఇవి పక్కా ప్లాన్ ప్రకారం మాట్లాడిన మాటలని అంటున్నారు. ప్రధాన వివాదాల నుండి జనాలను డైవర్ట్ చేయడం కోసమే ఈ తరహా స్టంట్స్ అని అంటున్నారు. ప్ర్రజెంట్ రాష్ట్రంలో రెండు కొత్త సమస్యలు తలెత్తి ఉన్నాయి. అవి అంతర్వేది రథం దగ్దం, రెండు రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించి, రీడింగ్ తీసి, వచ్చిన బిల్లుకు నగదును రైతుల ఖాతాల్లోకి వేసే నగదు బదిలీ పథకం. ఇవి రెండూ ప్రజల్లో, రైతుల్లో ఆందోళ పెంచుతున్నాయి. మరీ ముఖ్యంగా రథం దగ్దం వివాదమైతే చిలికి చిలికి హిందూ మతం మీద దాడి అనే స్థాయికి వెళ్లింది. అందుకే వాటి నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అమరావతిలో శాసన రాజధాని ఎందుకనే మాటలు మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు.