ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత మానుగుంట మహిధర్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహిధర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మహిధర్ రెడ్డి, సీనియర్ నేతగా జిల్లా వ్యాప్తంగా తన హావా కొనసాగించారు. అప్పట్లో మహిధర్ రెడ్డి చెప్పిందే వేదం, చేసిందే శాసనంలా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో మహిధర్ రెడ్డి ప్రాధాన్యత తగ్గిపోయిందని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.
కందుకూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా మహిధర్ రెడ్డి కుటుంబానికి మంచి పట్టుఉంది. గతంలో ఆయన తండ్రి ఆదినారాయణరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తండ్రి రికార్డ్‌ను బ్రేక్ చేసిన మహిధర్ రెడ్డికి కందుకూరు నియోజక వర్గంలో మంచి పట్టు ఉందనే టాక్ అప్పట్లో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత మహిధర్ రెడ్డి అంటే 2014 నుండి పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు.
ఇక 2019లో మళ్ళీ రాజకీయాల్లో యాక్టీవ్ అయిన మానుగుంట, వైసీపీ నుండి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన కందుకూరుకే పరిమితం అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నా, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా, అధికారులు మాత్రం, మహిధర్ రెడ్డి మాట వినడం లేదని, ఇటీవల ఆయన ఆరోపిస్తున్నారు. తాగునీటి సమస్య కోసం ఒంగోలు జెడ్పీ ఆఫీస్ వద్ద, అర్ధరాత్రి ఒంటి గంట వరకు హడావుడి చేయడం, అధికార పార్టీలో కలకలం రేపింది.
ఈ నేపధ్యంలో అధికారుల తీరు కారణంగా తన నియోజకవర్గంలో కనీస సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నామని, తాజాగా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహిధర్ రెడ్డి హడావుడి దెబ్బకి సమస్య పరిష్కారం అయినా, మహిధర్ రెడ్డి వైఖరి జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చకే తెరలేపింది. ఇక తాజాగా కరోనా నేపధ్యంలో జిల్లా కలెక్టర్ సరిగ్గా పని చేయడం లేదని మానుగుంట పదే పదే ఆరోపిస్తున్నారు.
జిల్లాలో కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యే మాటకే అధికారులు విలువనిస్తున్నారని, మిగతా ప్రజా ప్రతినిధులను పట్టించుకోవడం లేదని మహిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు మంత్రి పనిచేసిన నాయకుడికి ఏమైందని ఆ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారట. పవర్ చూపించాలని తాపత్రయంతో, పూర్తిగా అసంతృప్తి వాదిగా మారిపోతున్నారనే జిల్లా వ్యప్తంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాట.
అంతే కాకుండా కేవలం నియోజకవర్గ సమస్యల పై ఈ స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంతలా ఆందోళణ చేయం ఏంటని, కొందరు చెవులు కొరుక్కుంటున్నారట. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న ఆదిపత్య పోరు కారణంగానే రోడ్డెక్కుతున్నారా లేక ఇంకేదైనా పదవి ఆశించి, మహిధర్ రెడ్డి ఇలా చేస్తున్నారా అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా పవర్ కోసం మహిధర్ రెడ్డి అంసతృప్త వాదిగా మారుతున్నారని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.