మంచు విష్ణుకు మరోసారి పరాజయం తప్పలేదు. టాలీవుడ్ దర్శకులను పక్కనపెట్టి జెఫ్రీ గీ చిన్ అనే హాలీవుడ్ దర్శకుడిని తీసుకొచ్చి మోసగాళ్ళు సినిమా చేశారు. అందరూ పాన్ ఇండియా అంటున్నారు.. మనం కూడా చేద్దాం అనే ఉద్దేశ్యంతో చేశారో ఏమో కానీ సినిమాలో స్టఫ్ లేకుండానే భారీ మొత్తంలో డబ్బు కుమ్మరించారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకు చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ 21 కోట్ల వరకు టార్గెట్ పడింది. అయితే ఇందులో కనీసం 10 శాతాన్ని కూడ సినిమా వెనక్కు రాబట్టలేకపోయింది.
మార్చి 19న రిలీజైన ఈ చిత్రం మొదటిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. జాతిరత్నాలు ప్రభావంతో సినిమా మరింత కుంగిపోయింది. ఏ దశలోనూ కోలుకోలేదు. ఏకంగా 20 కోట్ల నష్టాలను చూసింది. కొత్త సినిమాలు రావడంతో థియేటర్ల నుండి పూర్తిగా మాయమైంది. ఫుల్ రన్ ముగిసేనాటికి ప్రపంచవ్యాప్తంగా కోటి షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇక గ్రాస్ సంగతి మాట్లాడుకోనక్కర్లేదు. 2 కోట్ల వరకు కూడ లేదు. దీంతో 20 కోట్ల నష్టం మిగిలింది సినిమాకు. విష్ణుకు అనేక ఫ్లాప్ సినిమాలున్నా ఇది మాత్రం ఎపిక్ డిజాస్టర్ అయింది. మరి ఇప్పుడైనా విష్ణు కళ్ళు తెరిచి మార్కెట్ స్థాయికి తగ్గట్టు సినిమాలు చేస్తే ఏమైనా మంచి ఫలితాలు రావొచ్చు.