పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి పదవిపై కన్నేశారట. ముచ్చటగా మూడోసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే మమతా బెనర్జీ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. మమత ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ నానా రకాల ప్రయత్నాలూ చేసి విఫలమైంది. నిజానికి, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్ని ఓ రాష్ట్ర ఎన్నికల్లా కాకుండా ప్రధాని నరేంద్ర మోడీకీ, మమతా బెనర్జీకీ మధ్య జరిగిన రాజకీయ యుద్ధంలానే భావించాలి. ఈ యుద్ధంలో మమత గెలిచారా.? మోడీ గెలిచారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమత ఓడిపోయారు కాబట్టి, మోడీ గెలిచినట్లేనన్నది ఓ వాదన. కాదు కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది కాబట్టి, ఓడింది నరేంద్ర మోడీయేనన్నది ఇంకో వాదన.
ఇవన్నీ ఓ ఎత్తు, మమతా బెనర్జీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలనే డిమాండ్లు ఇంకో యెత్తు. పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు మమతా బెనర్జీని ముందు పెట్టి తృతీయ కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వన్నాయి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. అయితే, దానికి ఆయనే నాయకత్వం వహించాలనుకున్నారు.. సాధ్యపడలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. దేశంలో మోడీని ఢీకొట్టగల ఒకే ఒక్క నేత మమతా బెనర్జీయేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లు కూడా ఇదే భావన వ్యక్తం చేస్తున్నారు. దాంతో, అతి త్వరలోనే మమత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో మమతకి మద్దతిచ్చే విషయంలో ఆయా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజం. కొత్త కూటమి.. ఏర్పాటు కాకముందే లుకలుకలతో కుప్పకూలిపోయేందుకు అవకాశాలెక్కువ.