మ‌హేష్ బాబు పోలీస్ స్టేష‌న్‌లో ఎందుకు ఉన్నాడు.. అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌నకు తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు దేశ విదేశాల‌లోను విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను ఇంకా యంగ్ లుక్‌తో క‌నిపిస్తున్న మ‌హేష్ బాబు వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. గ‌త ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంతో అభిమానుల‌కు మంచి వినోదాన్ని అందించిన మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌కత్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.


ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట అనే చిత్రం దుబాయ్‌లో సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ షెడ్యూల్‌ను ఫిబ్ర‌వ‌రి 21 వ‌ర‌కు పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని తీసుకొని సినిమాని రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌హేష్ 27వ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. న‌వీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు.

దుబాయ్ షూటింగ్‌లో పాల్గొంటున్న మ‌హేష్ బాబు అక్క‌డి అందాల‌ను అభిమానుల ముందు ఉంచుతూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా ఆయ‌న దుబాయ్‌లో ఉన్న లా మెర్‌లోని పోలీస్ స్టేష‌న్‌ను సంద‌ర్శించారు. మ‌నుషుల‌తో సంబంధం లేకుండా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న ఈ స్టేష‌న్‌ను చూసి మ‌హేష్ ఆశ్చ‌ర్య‌పోయారు. ప్ర‌పంచంలో ఇలాంటి పోలీస్ స్టేష‌న్ ఎక్క‌డా లేద‌ని, ఇది నన్ను ఆశ్చ‌ర్యానికి గురి చేసిందని మ‌హేష్ వీడియోలో తెలియ‌జేశాడు.