సొసైటీలో ఎవరైనా ఈజీగా టార్గెట్ చేయగలిగేది సినీ తారలనే. హీరో హీరోయిన్ల గురించిన చర్చ అంటే అందరికీ అమితమైన ఆసక్తి. స్టార్లు కూడ తమ గురించి రకరకాలుగా మాట్లాడే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోవాలని, వాళ్ళకి సమాధానం చెప్పాలని ఉన్నా అనేక కారణాలు వారిని వెనక్కి లాగుతుంటాయి. సినిమాలకు సంబంధించిన విషయాల మీద గాసిప్స్ అయితే పర్వాలేదు. కానీ వ్యక్తిగత విషయాల మీద పుకార్లు అంటేనే తట్టుకోవడం కష్టం. ఒకవేళ ఊరకుండలేక రెస్పాండ్ అయితే ఆ వివాదం చాలావరకు వెళుతుంది. అందుకే హీరోల తరపున వారి అభిమానులు రంగంలోకి దిగి పుకార్లకు, అనవసరవు చర్చలకు చెక్ పెడుతుంటారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఒక పత్రిక పెట్టిన చర్చకు ఆయన అభిమానులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. వార్తలు దొరకలేదో ఏమో కానీ సదరు టాప్ పత్రిక తమ వెబ్ సైట్లో మహేష్ బాబు జుట్టు నిజమైందా కాదా అనే డిస్కషన్ పెట్టింది. మహేష్ బాబుది ఆర్టిఫిషియల్ హెయిర్ అని, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని, ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం అధునాతన హెయిర్ ప్యాచ్ టెక్నాలజీని వాడారని, దీని మీద పెద్ద చర్చ నడుస్తోందని రాసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు అసలు మహేష్ బాబు హెయిర్ ఒరిజినల్ అయితే ఏంటి కాకపోతే ఏంటి, ఇప్పుడు ఆ చర్చ అవసరమా, తెలుసుకుని ఏం చేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఏకి పారేశారు. మనస్సాక్షి అని చెప్పుకుంటూ ఇలాంటి వార్తలా రాసేది అంటూ మండిపడ్డారు. దీంతో నాలుక కరుచుకున్న సదరు వెబ్ సైట్ ఆ వార్తను వెంటనే తొలగించింది.