‘మా’ రాజకీయం.. ఎవరికి లాభం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంలో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తాజాగా హేమ పేరుతో ఓ ఆడియో టేపు లీక్ అయ్యింది. ఎన్నికలు జరగకుండా కొందరు కుట్ర పన్నుతున్నారన్నది సీనియర్ నటి హేమ ఆరోపణ. నరేష్, తన పదవిని నిలబెట్టుకునేందుకోసం ఎన్నికలు జరగకుండా ప్లాన్ చేస్తున్నారనీ, ఆయనకు కొందరు సినీ ప్రముఖులు అండగా నిలిచారని హేమ ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో హేమ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్న విషయం విదితమే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ.. తదితరులతోపాటు ఇంకొందరు కూడా అధ్యక్ష బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మాత్రం, ఆ పదవి వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఎన్నికలకు ఇంకా సమయముందని అంటున్నారాయన. సరే, ఎవరి గోల వారిదే.

వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఓ అసోసియేషన్ విషయంలో ఇంత రాజకీయం అవసరమా.? అన్నది అసలు ప్రశ్న. అధ్యక్ష పీఠమెక్కితే ఎవరికైనా వచ్చే లాభమేంటి.? ఆ పదవి వల్ల అదనపు ప్రయోజనాలు ఎవరికైనా వుంటాయా.? వుండవాయె. మరెందుకు ఈ పదవి పట్ల అంత మోజు.? పలుకుబడి పెంచుకోవడం, ఆ తర్వాత వివాదాలు ఎదుర్కోవడం.. ఇదీ మా అధ్యక్ష పదవి చుట్టూ ప్రతిసారీ జరుగుతున్నది. పోనీ, ‘మా’ అధ్యక్షులకు తగిన గౌరవం లభిస్తుందా.? అంటే అదీ వుండదు. ‘మా’కి అదనపు ఆదాయమేదీ తీసుకురాకుండా, వున్న నిధుల్లోంచి మూడు కోట్లు నరేష్ ఖర్చు చేసేశారని హేమ చేసిన ఆరోపణతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. కరోనా వేళ ‘మా’కి ఆదాయం వచ్చే అవకాశాల్లేవు. కానీ, ఖర్చులు జరగాల్సిందే. అయితే, సినీ పరిశ్రమలో ‘మా’ని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులెవరూ ముందుకు రారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.