‘మా’ యుద్ధం మొదలు: గెలిచేదెవరు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం, ఇతర పదవుల కోసం యుద్ధం మొదలయిపోయినట్లే. నిజానికి, యుద్ధం ఎప్పుడో మొదలైపోయింది. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ ప్యానల్.. తాము బరిలో నిలబడుతున్నట్లు ప్రకటించడం జరిగిందో, ఆ తర్వాత నుంచే రచ్చ పతాక స్థాయికి చేరింది. ‘అంతకు మించి’ అనే స్థాయిలో ఎప్పటికప్పుడు రచ్చ ముదిరి పాకాన పడింది. ఆలూ లేదు చూలే లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్టు.. ‘మా’ ఎన్నికలు ఎప్పుడో తేలకుండా ఈ రచ్చ ఏంటి.? అని జనం ముక్కున వేలేసుకున్నారు. వెయ్యి మంది సభ్యులు కూడా లేని ఓ చిన్న అసోసియేషన్ ఎన్నికల కోసం ఇంత రాద్ధాంతం అవసరమా.? అని జనం చీదరించుకునే స్థాయికి సినీ ప్రముఖులు రచ్చ చేసి పారేశారు. ఎలాగైతేనేం, ఇప్పుడు ఎన్నిక తాలూకు తేదీ వచ్చేసింది.

అక్టోబర్ 10న పోలింగ్.. ఈలోగా ఆయా ప్యానెల్స్, ఆయా అభ్యర్థులు రచ్చ చేసేసుకోవచ్చన్నమాట. కులం, ప్రాంతం.. ఇలాంటి అంశాలన్నీ ఇప్పటికే ప్రస్తావనకు వచ్చేశాయి. ‘మా’ అసోసియేషన్ భవనం గురించి కూడా రచ్చ జరిగిపోయింది. అడ్డగోలు విమర్శలు చేసేసుకున్నారు.. ముందు ముందు ఇంకా దారుణంగా తిట్టుకోబోతున్నారు. నిజానికి, దీన్ని యుద్ధం అనకూడదు. యుద్ధం.. అన్న మాటకి చాలా గౌరవం వుంటుంది. కానీ, ఈ గొడవ వేరు. అస్సలేమాత్రం ప్రాధాన్యత లేని పదవులవి. ఆ పదవులకు తగిన గౌరవం సినీ పరిశ్రమలోనే దక్కదు. నిధులు బొక్కేయడానికేనా పదవులు.? అంటే, పదవుల్లో కూర్చున్నవారికి సినిమాల ద్వారా వచ్చే సంపాదనతో పోల్చితే, అసోసియేషన్ సొమ్ములు అసలు లెక్కే కాదు. మరెందుకింత రచ్చ? అంటే, అదో తుత్తి. కాదు కాదు అదో దురద.. అంటారు కొందరు. ఏ ప్యానల్ గెలుస్తుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇంకోసారి సినీ పరిశ్రమ మొత్తంగా ఓడిపోబోతోందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ఎన్నికలతో ప్రతిసారీ పరిశ్రమ పరువునే బజార్న పడేస్తున్నారు మరి.