‘మా’ అధ్యక్ష ఎన్నికల యుద్ధం తాలూకు ప్రకంపనలు ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రకంపనలు ముందు ముందు మరింత పెరిగేలా వున్నాయే తప్ప, తగ్గే ప్రసక్తే కనిపించడంలేదు. పోలింగ్ రోజున సాయంత్రం కౌంటింగ్ మొదలైంది. మొత్తంగా అక్కడున్నది సుమారుగా 650 ఓట్లు మాత్రమే. వాటిని లెక్కించడానికి పెద్దగా సమయం పట్టదు.
కానీ, ఏమయ్యిందోగానీ.. తొలి రోజు కొన్ని ఓట్లను లెక్కించి, రాత్రికి దుకాణం కట్టేసి.. మళ్ళీ ఉదయాన్నే కౌంటింగ్ పూర్తి చేశారు. రాత్రి దుకాణం కట్టేశాక బ్యాలెట్ పత్రాల్ని ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్ళడం వివాదాస్పదమయ్యింది. ఈ విషయమై ప్రకాష్ రాజ్ నుంచి బరిలోకి దిగిన సినీ నటుడు ప్రభాకర్ కొంత అభ్యంతరం వ్యక్తం చేశాడు.
‘నాకు ఆ అధికారం వుంది.. నేను ఇంటికి తీసుకెళతా..’ అని ఎన్నికల అధికారి చెప్పినట్లుగా ప్రభాకర్ చెబుతున్నాడు. ఇది అత్యంత దుర్మార్గమని సినీ నటుడు, నిర్మాత, ‘మా’ మాజీ అధ్యక్షుడు నాగబాబు ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. మోహన్ బాబుకి మద్దతుదారుడైన బీజేపీ నేత, సినీ ప్రముఖుడు త్రిపురనేని చిట్టి కూడా, బ్యాలెట్ పత్రాల్ని ఇంటికి తీసుకెళ్ళడం సబబు కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.
‘మా’ ఎన్నికల ఫలితాల్లో అర్థమే లేదని బ్యాలెట్ పత్రాల్ని ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్ళడంతోనే తేలిపోయింది. ఇక, ఈ ఫలితాల్ని పట్టుకుని ఒకరు గెలిచారనీ, ఇంకొకరు ఓడిపోయారనీ భావించడం, సంబరాలు చేసుకోవడం లేదా కుంగిపోవడం అనేది అస్సలు అర్థం లేని వ్యవహారం.
ఇంతకు ముందెన్నడూ ‘మా’ ఎన్నికల సందర్భంగా ఇలా జరిగిన దాఖలాల్లేవు. అసలు వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఓ అసోసియేషన్ ఎన్నికల కోసం మీడియా ఇంతలా ఫోకస్ పెట్టడం కూడా ఆశ్చర్యకరమే. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో చాలా సమస్యలున్నాయి.. వాటి మీద ఫోకస్ అనూహ్యంగా తగ్గిపోయింది తెలుగు మీడియాకి.