ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నటుడు పృధ్వీ.?

Actor Pridhvi : 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన సినీ నటుడు పృధ్వీ, వైసీపీ అధికారంలోకి రాగానే, ఎస్వీబీసీ ఛానల్‌లో కీలక పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ, అక్కడ జరిగిన రాసలీలల వ్యవహారంలో ఆయన మీద వేటు పడింది. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అధినేత వైఎస్ జగన్ వేటు వేశారంటూ పృధ్వీ వాపోతుంటారు.

అప్పట్లో వైఎస్ జగన్ అండ చూసుకుని, ప్రత్యర్థి పార్టీలపై బీభత్సమైన సెటైర్లు వేసేశారు పృధ్వీ. ఆ విమర్శలకు ఇప్పడాయన లెంపలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ‘నా మీద వేటు వేశారు.. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ తదితరుల్ని మాత్రం పక్కనే పెట్టుకున్నారు.. ఇదేం న్యాయం.?’ అంటూ పృధ్వీ వాపోతున్నారు.

రాజకీయం అంటే, అది ఒక్కసారి అంటించుకుంటే వదిలించుకోవడం కష్టం. పృధ్వీ కూడా రాజకీయాన్ని బాగానే వంటపట్టించుకున్నట్టున్నాడు. బాబోయ్ రాజకీయాలు నాకొద్దు.. అంటూనే, రాజకీయాలు మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన.. ఇలా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఆయన వున్నాడట.

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు గనుక, టీడీపీనో మరో పార్టీనో పృధ్వీకి అండగా నిలిచే అవకాశాలైతే లేకపోలేదు. ఇప్పటికే పలు పార్టీలతో పృధ్వీ చర్చలు జరిపాడని కూడా అంటున్నారు.

కానీ, తాను రాజకీయాల గురించి ఆలోచించడంలేదనీ, సినిమా కెరీర్ గురించే ఆలోచిస్తున్నాననీ చెబుతున్నాడు.