మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని పక్కన పెడితే, తెలుగు సినిమా ఓడిపోతోంది. ఔను, తెలుగు సినీ పరిశ్రమ స్థాయి అత్యంత దారుణంగా పడిపోతోంది. పరిశ్రమ పెద్దలెవరికీ ఈ విషయం అర్థం కావడంలేదా.? అర్థమయ్యి కూడా ఎవర్నీ వారించలేని అయోమయ పరిస్థితుల్లో వున్నారా.?
‘ఎన్నికల్లో మీరేం చేస్తారో చెప్పండి.. ఒకరి మీద ఒకరెందుకు విమర్శలు చేసుకుంటారు.?’ అని పోటీలో నిలబడ్డవారిని వారించలేని పెద్దలు, పరిశ్రమలో అసలు ‘పెద్దలు’ అన్న గుర్తింపు, గౌరవం ఎలా పొందగలుగుతారు.? ప్రకాష్ రాజ్ అయినా, మంచు విష్ణు అయినా.. తమ స్థాయిని తగ్గించుకుని మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నది నిర్వివాదాంశం.
ప్రకాష్ రాజ్‌కి తెలుగు వచ్చా.? రాదా.? అన్నది ఇక్కడసలు ప్రస్తావించుకోవాల్సిన అంశమే కాదు. మంచు విష్ణు సినిమా కలెక్షన్లపై ప్రకాష్ రాజ్ హేయంగా మాట్లాడటమూ సమర్థనీయం కాదు. ఒకర్ని మించి ఇంకొకరు తమ స్థాయిని తామే దిగజార్చేసుకుంటున్నారు.
తెలుగువారి చరిత్రకీ, ‘మా’ ఎన్నికలకీ సంబంధం ఏమన్నా వుందా.? ఇదెక్కడి వింత వాదన.? సీనియర్ నటుడు నరేష్ కూడా తన స్థాయిని దిగజార్చేసుకుని, ‘కృష్ణుడు.. రథ సారధి..’ అంటూ ఏవేవో మాట్లాడేస్తున్నారు. మరో సీనియర్ నటుడు బాబూమోహన్ కూడా, సాధారణ రాజకీయాల తరహాలో దిగజారుడుతనం ప్రదర్శిస్తున్నారు.
జీవిత, బండ్ల గనేష్.. చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటికి తోడు, మీడియాలో జరుగుతున్న విశ్లేషణల్లో కులం కార్డు తెరపైకొస్తోంది.. మతం పేరుతో రాజకీయం నడుస్తోంది.. ప్రాంతం పేరుతో రచ్చ జరుగుతోంది. ఏం, ఇన్ని ఆరోపణలు చేసుకున్నోళ్ళు.. రేప్పొద్దున్న సినీ పరిశ్రమలో కలిసి పని చేయరా.?