నరేష్ వర్సెస్ నాగబాబు: ‘మా’.. మసక మసక చీకటిలో..

MAA Elections: Naresh Vs Nagababu

MAA Elections: Naresh Vs Nagababu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహారానికి సంబంధించి కాస్త స్పష్టత వస్తోంది. ప్రకాష్ రాజ్ వైపు నాగబాబు నిలబడ్డారు.. అది బహిరంగ రహస్యం. ప్రకాష్ రాజ్ తనకు మంచి స్నేహితుడని అంటూనే.. ప్రకాష్ రాజ్ మీద సెటైర్లేస్తున్న నరేష్.. మంచు విష్ణుకి మద్దతిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ‘మా’ ప్రతిష్ట మసకబారిందంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల నరేష్ కౌంటర్ ఎటాక్ చేశారు.

‘ఇది రాజకీయ సంస్థ కాదు..’ అంటూ, రాజకీయ తరహా విమర్శలు నరేష్, అత్యంత తెలివిగా చేసేశారు. ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చంటూనే, గతంలో ‘మా’ కోసం ప్రకాష్ రాజ్ ఏమీ చేయలేదని నరేష్ విమర్శించడాన్ని ఏమనాలి.? లోకల్ – నాన్ లోకల్ ఆరోపణలు తాము చేయబోమని నరేష్ చెబుతున్నారుగానీ, నరేష్ మద్దతుదారుల నుంచే ప్రకాష్ రాజ్ మీదకు ఈ విమర్శలు తొలుత దూసుకొచ్చాయి.

నిజానికి, ‘మా’ వ్యవహారాలపై మీడియాకెక్కడంతోనే ‘మా’ ప్రతిష్ట మసకబారిపోయింది. వెయ్యిమంది సభ్యులు కూడా లేని ‘మా’ గురించి ఇంత రచ్చ ఎందుకు.? అని సామాన్యులు భావిస్తున్నారు. అది సినీ పరిశ్రమతో ముడిపడి వున్న సంగతి కావడం, సినీ ప్రముఖులు ఒకర్నొకరు తిట్టుకుంటుండడంతో.. మీడియా బాగానే ‘తాళింపు’ వేస్తుంటుంది.

దానికి నరేష్ అయినా, ప్రకాష్ రాజ్ అయినా.. మరొకరు అయినా ఇంకాస్త ప్రోత్సాహం అందిస్తూనే, వీలు చూసుకుని మీడియా మీదా సెటైర్లు వేస్తుంటారు. మొత్తంగా చూస్తే, ఇదొక థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం వుంది. కానీ, అప్పుడే మీడియాలో ఈ వ్యవహారానికి విపరీతమైన హైప్ వచ్చేసింది. ముందు ముందు ఈ రచ్చ ఇంకా తారాస్థాయికి చేరబోతోంది.