ఈ కేసు ఇప్పటిది కాదు.. చాలా ఏళ్ల నుంచి ఈ కేసు తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదును కూల్చేసిన కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతితో పాటుగా మరికొందరు నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
సుమారు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం 49 మందిపై ఆరోపణలు రాగా… కేసు విచారణ సమయంలోనే 17 మంది మృతి చెందారు. ఇక.. మిగిలిన 32 మంది నిందితులపై విచారణ జరిపిన కోర్టు… ఈ కేసు విషయంలో 351 మంది సాక్షులను విచారించింది.
ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేసి తుదితీర్పును వెల్లడించాలని సుప్రీం కోర్టు ఇదివరకే సీబీఐ కోర్టును ఆదేశించడంతో… సీబీఐ కోర్టు సాక్షులను విచారించిన అనంతరం… తీర్పును వెల్లడించింది.
ఈ కేసులో పెద్దపెద్ద నాయకులు ఉండటంతో.. తీర్పు కోసం దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. చివరకు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా నిర్దోషులేనని కోర్టు తీర్పు చెప్పింది.
నిందితులుగా పేర్కొన్నవాళ్లు నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో… మసీదు కూల్చివేత కుట్ర కాదని.. వాళ్లను నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది.
ఈసందర్భంగా తీర్పును వెలువరించిన న్యాయమూర్తి ఎస్కే యాదవ్.. 2000 పేజీల తీర్పును చదివి వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరుకాగా.. మిగితా నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు.