జనసేన-బిఎస్పీ పొత్తా..భవిష్యత్ రాజకీయాల కోసమే మాయావతితో భేటీ ?

భవిష్యత్ రాజకీయాల కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతితో భేటీ అయ్యారా ? జనసేన వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేమిటంటే, మాయావతిని కలవటానికి పవన్ ఈరోజు లక్నోకు వెళ్ళారు. హఠాత్తుగా మాయావతిని కలవాల్సిన అవసరం పవన్ కు ఏమొచ్చింది ? ఇపుడిదే ప్రశ్న రాజికీయాల్లో చక్కర్లు కడుతోంది. జనసేన వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో బిఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ అనుకుంటున్నారట. ఆ విషయంపై మాట్లాడేందుకే మాయావతితో భేటీ అయినట్లు తెలుస్తోంది.

నిజానికి మాయావతేమో ఫుల్ టైం పొలిటీషియన్. ఉత్తర్ ప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా లేకపోతే ఎంపి హోదాలో పార్లమెంటులో అదరగొట్టేస్తారు. అంటే మాయావతి అంత సీరియస్ పొలిటీషియన్. అటువంటిది ఏదో సీజనల్ పొలిటిషీయన్ గా ప్రచారంలో ఉన్న పవన్ కలవటం ఏంటనేదే ప్రశ్న. అందుకే జనసేన వర్గాలు జనసేన, బిఎస్పీ మధ్య పొత్తు చర్చల కోసమే మాయావతితో భేటీ అయినట్లు చెబుతున్నారు.

పార్టీ ఏర్పాటై ఐదేళ్ళవుతున్నా గ్రామస్ధాయి నుండి ఇప్పటి వరకూ పార్టీ నిర్మాణమే జరగలేదు. ఒకటి నుండి పది వరకు తీసుకుంటే అన్నీ స్ధానాల్లోను పవనే కనిపిస్తారు. పార్టీ తరపున ఏ జిల్లాలో కూడా గట్టి నేత అని చెప్పుకోవటానికి ఒక్కళ్ళు కూడా లేరు. ఇటువంటి పరిస్ధితుల్లో జనసేన 175 నియోజకవర్గాల్లోను పోటీ చేస్తుందని పవన్ చెబుతున్నా ఎవరూ నమ్మటం లేదు. పోటీ చేసే సంగతి తర్వాత ముందు అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరుకుతారా అన్నదే అనుమానం.

పవన్ రాజకీయ నినాదం ఎటూ అట్టడుగు, అణగారిన వర్గాలకు రాజకీయాధికారమే కదా ? ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మాయావతితో భేటీ అయ్యారట. తెలుగు రాష్ట్రాల్లో బిఎస్పీ గతంలో కూడా చాలా చోట్లే పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో అయితే తెలంగాణా లో ముగ్గురు ఎంఎల్ఏలు గెలిచారు కూడా. సరే తర్వాత టిఆర్ఎస్ లో కలిసిపోయారనుకోండి అది వేరే సంగతి.

ప్రజా ప్రతినిధుల విషయం తీసుకుంటే జనసేనకన్నా బిఎస్పీనే మెరుగ్గా ఉంది. దానికితోడు మాయావతితో పొత్తులు పెట్టుకుంటే దేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించ వచ్చని పవన్ భావిస్తున్నట్లున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి తరపున మాయావతి ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్నారు. కాబట్టి పవన్ ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.  అయితే బిఎస్పీ వర్గాలు మాత్రం వచ్చే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ తో కలిసి బిఎస్పీతో పోటీ చేస్తుందని చెబుతున్నాయి.