ఒకే ఒక్క డైలాగ్.. తొలుత టీడీపీ అభిమానుల్ని ఉర్రూతలూగించింది. కానీ, అంతలోనే టీడీపీ అభిమానులూ ఆలోచనలో పడ్డారు. ఇలాంటి డైలాగులతో రాజకీయాలా.? ఇదేం పైత్యం.? అన్న చర్చ వారిలో జరిగుతోంది. ‘ఔను, ఒక్క డైలాగ్తో నారా లోకేష్, తన స్థాయిని పాతాళానికి తొక్కేసుకున్నారు. టీడీపీని దారుణంగా దెబ్బ తీశారు..’ అన్న అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ, ఏంటా డైలాగ్.? ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలున్నారు.. వాళ్ళ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తే..’ అంటూ గుంటూరులో జరిగిన విద్యార్థిని రమ్య హత్య ఘటన విషయమై నారా లోకేష్ చేసిన అనవసర ప్రస్తావనే అది. ఏ కుటుంబానికీ ఇలాంటి దుస్థితి రాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. ‘పగవాడికీ రాకూడని కష్టమది..’ అని ఇలాంటి సందర్భాల్లో భావించే సమాజం మనది.
రాజకీయం కోసం, పబ్లిసిటీ కోసం.. వైఎస్ జగన్ కుమార్తెల్ని వివాదాల్లోకి లాగడం నారా లోకేష్ వంటి నాయకులకు సబబా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎలాగైనా విమర్శించొచ్చు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిగా అది నారా లోకేష్ రాజకీయ హక్కు.. అనుకోవచ్చు. దానికి వైసీపీ నుంచి కూడా అంతకన్నా ఘాటుగా ఎదురుదాడి చేసి తీరుతుంది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ‘నువ్ మగాడివైతే..’ అంటూ నారా లోకేష్, తన ప్రసంగంలో విరుచుకుపడిపోయారు. ఇదెక్కడి చోద్యం.? ఇదెక్కడి పైత్యం.? ‘మహిళా ముఖ్యమంత్రో.. మహిళా హోం మంత్రో.. నాకు అర్థం కావడంలేదు..’ అంటూ నారా లోకేష్ సెటైర్లు వేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి, చంద్రబాబు హయాంలో కూడా రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగాయి.. అత్యాచారాలు, హత్యాచారాలూ జరిగాయి. అప్పట్లో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను ఎవరైనా తెరపైకి తెచ్చారా.? రాజకీయం ఏ స్థాయికి దిగజారుతోంది.? రాష్ట్ర రాజకీయాల్ని టీడీపీ ఏ స్థాయికి దిగజార్చుతోంది.?