బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కార్మికుల పట్ల దేవుడు అని చెప్పాల్సిన పనిలేదు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస బాధితుల్ని సొంత డబ్బులు ఖర్చు చేసి బస్సులేసి స్వరాష్ర్టలకు తరలించారు. కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలే చేయని పనని సోనుసూద్ చేసి చూపించారు. ఈ నేపథ్యంలో ఇందులో రాజకీయం ఉందని ఆరోపణలొచ్చాయి. మహరాష్ర్ట అధికార పార్టీ సోనుసూద్ వెనుక బీజేపీ ఉందని ఆరోపించింది. వాటికి కండర గండరుడు గట్టిగానే కౌంటర్ వేసారు. ఆ తర్వాత తన సేవల్ని కొనసాగించారు. తెలుగు రాష్ర్టాలకు ప్రత్యేక విమానం ద్వారా విదేశాల్లో చిక్కుకున్న కొంత మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేసారు.
అలాగే చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ రైతు పొలందున్నేందుకు డబ్బులు లేకపోవడంతో కుమార్తెలు నాగలి లాగుతున్న సన్నివేశం చూసి చలించిపోయారు. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన సోనుసూద్ ఆ రైతుకు ట్రాక్టర్ కొనిస్తానని ప్రామిస్ చేసారు. ఈ ప్రకటన చూసిన టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అలియాస్ చినబాబు స్పందించారు. కష్ట కాలంలో సోను చేస్తోన్న మంచి పనులను ప్రశంసించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాక్షించారు. చిత్తూరు జిల్లా రైతు కుటుంబం పట్ల ప్రదర్శించిన సానుభూతి, దయ నిజంగా అభినందనీయం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
అన్నట్లు చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అన్న సంగతి తెలిసిందే. అలాగే సోనుసూద్ చేసిన మంచి పనులను పలు రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారు. రాజకీయాలు లోకి రావడానికి ఇదే సరైన సమయం అంటూ పలు పార్టీలు ఆహ్వానించాయి. కానీ ఆయన ఇప్పటికి నో పాలిటిక్స్ అంటూ బధులిచ్చారు. భవిష్యత్ ఏమో చెప్పలేం అంటూ చెప్పకనే చెప్పారు. మొత్తానికి కరోనా సమయంలో రోడ్డెక్కి వలస కార్మికులను అదుకున్న రియల్ హీరోగా మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.