దేశంలో పలు రాష్ట్రాల్లో మళ్ళీ లాక్ డౌన్ దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నైట్ కర్ఫ్యూ గురించి ఆయా రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే, తెలంగాణలో విద్యా సంస్థల్ని మూసివేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరి, బార్లు.. రెస్టారెంట్లు.. సినిమా హాళ్ళ విషయంలో ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదన్న ప్రశ్న తెరపైకొచ్చింది. న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయిస్తున్నారు కొందరు ఈ విషయమై. సినీ పరిశ్రమ అంటే, కోట్లాది రూపాయల వ్యాపారం మాత్రమే కాదు.. వందలాది, వేలాది జీవితాలు కూడా.
సినిమా రిలీజులు ఆగిపోతే ఇంకేమన్నా వుందా.? థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యను తగ్గించేసినా పరిస్థితి దారుణంగా తయారవుతుంది. పెద్ద సినిమాల రిలీజుల కోసం క్యూ కట్టేసిన పరిస్థితిని చూస్తున్నాం. ఈ తరుణంలో లాక్ డౌన్ వార్తలు మరింతగా సినీ పరిశ్రమను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. సినిమా కంటే, ప్రాణాలు ముఖ్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, గతంలో లాక్ డౌన్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రవాణా సౌకర్యాల్లేక.. సుదూర ప్రయాణాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోతే, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులతో మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య కంటే, ఈ సంఖ్య ఎక్కువనే వాదనా లేకపోలేదు. ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందోగానీ.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండడం సినీ పరిశ్రమనే కాదు, అన్ని రంగాల్లోనూ ఆందోళన నెలకొనేలా చేస్తోంది. అదుపు చేయలేని పరిస్థితికి వచ్చాక, లాక్ డౌన్ పెట్టినా ప్రయోజనం వుండదేమో.