ఏపీలో ఎన్నికల కోలాహాలం మాములుగా లేదు. ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికలు వస్తున్నాయి. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు అలా పూర్తి అవ్వగానే మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవ్వబోతోంది. ఐతే… ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం తగిన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే… మార్చి 8, 9, 10 తేదీల్లో వైన్ షాపులు బంద్ చేయబోతోంది.
అంటే ఎన్నికలు జరిగే పట్టణాల్లో పోలింగ్‌కి 48 గంటల ముందు మద్యం అమ్మకాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్… సోమవారం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు 24 గంటల ముందు కూడా మద్యం అమ్మకాలు ఉండవు. అంటే ఓట్ల లెక్కింపు మార్చి 14న ఉంటుంది కాబట్టి మార్చి 13, 14న కూడా మద్యం అమ్మకాలు ఉండవనుకోవచ్చు. ఇందుకు సంబంధించి కూడా ఆదేశాలు వెళ్లిపోయాయి.
అత్యవసర విభాగాల్లో తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లోని వాహనాలను ఎన్నికల పనుల కోసం రెడీ చేసే పనిలో ప్రభుత్వ వర్గాలు బిజీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు… రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయకూడదు. చేస్తే ఎన్నికల కోడ్ ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎస్ తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టినా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు మార్చి 10న జరగనున్నాయి. మార్చి 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారం కిందట ప్రకటన విడుదల చేశారు. మార్చి 2 నుంచి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. మార్చి 10వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీ పోలింగ్ అవసరమైన చోట మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపింది.