మందు ప్రియులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏపీలో కొత్తగా మద్యం మాల్స్ రాబోతున్నాయి. వాక్ ఇన్ షాప్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని తీసుకురానుంది.
సాధారణంగా మనం మాల్స్ చూస్తుంటాం కదా. అక్కడ మనకు నచ్చిన వస్తువును తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లొచ్చు. అలాగే మద్యం మాల్స్ కూడా. ఈ మద్యం మాల్స్ లో దొరకని బ్రాండ్ ఉండదు. అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి. తమకు నచ్చిన బ్రాండ్ మద్యాన్ని తీసుకొని డబ్బులు ఇచ్చి తీసుకెళ్లే విధంగా వీటిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
ఏపీ వ్యాప్తంగా మొత్తం 100 వరకు ఇటువంటి మద్యం మాల్స్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో ఉన్న పెద్ద నగరాలతో పాటు జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
వీటి నిర్వహణ మొత్తం ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చూసుకుంటుంది. దాని కోసం 2020-21 కు నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 30 సెప్టెంబర్, 2021 వరకు ఈ మద్యం విధానం అమలులో ఉంటుంది. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం దుకాణాల్లో కొన్ని రకాల బ్రాండ్లే అందుబాటులో ఉంటాయి. కానీ.. త్వరలో ఏర్పాటు చేయబోయే మద్యం మాల్స్ లో అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి.