Acharya : దేశంలో కోవిడ్ మూడో వేవ్ మొదలైపోయింది, చాలా వేగంగా విస్తరించేసింది. చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లపై ఆంక్షలు షురూ అవుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యుపెన్సీలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఆంక్షలు మొదలు కాలేదు.
ఇదిలా వుంటే, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఏపీలో టిక్కెట్ల ధరల లొల్లి, కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ఈ సినిమాల్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక, ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ‘ఆచార్య’ పరిస్థితేంటి.? అది కూడా వాయిదా పడక తప్పేలా లేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఆచార్య’ సినిమా విడుదలను వాయిదా వేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి కోవిడ్ తీవ్రత పెరిగే అవకాశం వుంది తప్ప, తగ్గే అవకాశమైతే లేదు. దాంతో, ‘ఆచార్య’ వాయిదా తప్పకపోవచ్చు.
నిజానికి, ‘రాధేశ్యామ్’ వాయిదా విషయంలో నిర్మాతలు చాలా మల్లగుల్లాలు పడాల్సి వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ అదే జరిగింది. సో, ‘ఆచార్య’ వాయిదాపైనా నిర్మాతలు ఈ నెల మూడో వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.
ఏదిఏమైనా, తెలుగు సినిమాకి కరోనా వైరస్ కారణంగా పెద్ద ముప్పే వచ్చి పడింది. ఇకపై థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదల చేసే పరిస్థితి వుండదా.? పూర్తిగా ఓటీటీ వైపే తెలుగు సినిమా చూడాలా.? అన్నదానిపై సినీ పరిశ్రమలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.