గంటా లాంటి వాళ్లు వైసీపీలో చాలామందే ఉన్నారుగా

Master plan behind Ganta resignation 
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం వాడీ వేడిగా నడుస్తోంది.  గంటా మొదటి నుండి పవర్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు.  ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉండటం ఆయన స్టైల్.  అందుకే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీంటితోనూ ఆయనకు పరిచయాలున్నాయి.  ఏ పార్టీలోకి వెళ్లినా తక్కువ కాలంలోనే కీలకంగా ఎదగడం గంటాకు వెన్నతో పెట్టిన విద్య.  ఇప్పుడు ఈ విద్యే వైసీపీలో అవంతి లాంటి కంగారు పుట్టిస్తోంది.  ఎందుకంటే గంటా వైసీపీలోకి మారడానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.  మొదట్లో ఆయన చేరిక కష్టమనే అనుకున్నా ఇప్పుడు పరిస్థితులు మారినట్టు కనిపిస్తోంది. 
 
అసలు ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారాల్సింది.  కానీ ఎందుకో ఆగారు.  ఆ సమయంలో అవంతి వైసీపీ కండువా కప్పుకోవడం, భీమిలీ నుండి గెలవడం, ఆ వెంటనే మంత్రి అయిపోవడం జరిగింది.  ప్రజెంట్ విశాఖ రాజకీయాల్లో అవంతి కీలకంగా ఉన్నారు.  అలాంటిది ఇప్పుడు గంటా వెళ్ళి ఆ పార్టీలో చేరితే  విశాఖ మీద ఆధిపత్యం కోసం పోటీ ఏర్పడుతుంది.  పార్టీ పెద్దల్ని మేనేజ్ చేయడంలో గంటా సిద్దహస్తుడు.  ఆయనంతటి చాకచక్యం అవంతికి లేదన్నది వాస్తవం.  అందుకే ఆయన రాకను అవంతి మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు.  అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. 
 
తాజాగా కూడా భీమిలిలో గంటాను వైసీపీలోకి రానివ్వొద్దంటూ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు.  అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారని, ఆయన అవినీతిపరుడని, గతంలో వైఎస్ జగన్ మీద విమర్శల దాడి చేసిన టీడీపీ నేతల్లో కీలకమైన వ్యక్తని అంటూ ఆరోపిస్తున్నారు.  నిజమే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గంటా జగన్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడిన మాట వాస్తవం.  కానీ ఆయనలా జగన్ మీద మాటల దాడి చేసి ఇప్పుడు అదే పార్టీలో పదవులతో వెలిగిపోతున్నవారు చాలామందే ఉన్నారు.  అంతెందుకు టీడీపీలో ఉండగా అవంతిగారు జగన్ మీద దాడి చేయలేదా.  తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ, రోజా లాంటి నేతలైతే వైఎస్ రాజారెడ్డి దగ్గర్నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ఇలా వరుసపెట్టి అందరినీ తిట్టినవారే.  అలాంటప్పుడు గంటా మీద మాత్రమే తిట్టేసి తీర్థం పుచ్చుకుంటారా అనే ఆరోపణలు తగవు కదా.