ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను అధికారంలోకి వచ్చాక, రెండేళ్ళ తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై తొలి కీలక అడుగు వేసినట్లు భావించాలేమో. అసెంబ్లీకి వెళ్ళేందుకోసం వీలుగా కరకట్ట రోడ్డుని రెండు వరుసలుగా మార్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటిదాకా చాలా ఇరుగ్గా వున్న ఈ రోడ్డు, ఇకపై రెండు వరుసల విశాలమైన రోడ్డు కాబోతోంది. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా రోడ్ కనెక్టివిటీ అత్యంత ముఖ్యం.
చంద్రబాబు హయాంలో కరకట్టను కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరాల కోసమే మెరుగుపరిచారు. ఆ రోడ్డుపై సాధారణ రాకపోకలు అంత విరివిగా సాగేవి కాదు. అయితే, రాజధాని కోసమంటూ అత్యంత విశాలంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపట్టింది చంద్రబాబు సర్కార్. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి కొన్ని చోట్ల భూ వివాదాలు తలెత్తడంతో, ఆ రోడ్డు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది.
కొంత దూరం అత్యద్భుతంగా రోడ్డు నిర్మాణం జరిగినా, మధ్యలో పొలాలు రోడ్డు అడ్డంగా కనిపిస్తాయి. ఇక, ఇప్పుడు కరకట్ట రోడ్డు గనుక వేగంగా నిర్మితమైతే.. ఆంధ్రపదేశ్ అసెంబ్లీకి వెళ్ళేందుకు రాచమార్గంగా ఉపయోగపడుతుందన్నది నిర్వివాదాంశం. శాసన రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా కీలకమైన అడుగు.. అని చెబుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం, అదే మాటకు కట్టుబడి.. చంద్రబాబు హయాంలో నిర్మాణం ప్రారంభమై, మధ్యలో ఆగిపోయిన భవనాల నిర్మాణాన్ని కొనసాగిస్తుందనే ఆశిద్దాం.
అదే జరిగితే, అమరావతి ప్రతిష్ట నిలబడుతుంది.. రాష్ట్రానికి రాజధాని లేదన్న అవమా భారం నుంచి ఆంధ్రపదేశ్ ప్రజలు కాస్తంత ఊరట పొందుతారు. అయితే, రానున్న మూడేళ్ళలో ఇవన్నీ సాధ్యమేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.