చక్కటి ప్లానింగ్‌తో ‘మణిశంకర్’ను నిర్మించారు : సంజన గల్రానీ.

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. డ‌బ్బు చుట్టూ తిరిగే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) నిర్వ‌హించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న ల‌భించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. విడుదల తేదీపై దర్శక నిర్మాతలు ప్రకటన చేశారు. ఈ ఈవెంట్‌లో..

సంగీత దర్శకుడు ఎం ఎల్ రాజా మాట్లాడుతూ.. ‘సినిమా ఫస్ట్ కాపీ అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంటుంది. యాక్షన్స్, విజువల్స్ అన్నీ బాగుంటాయి. శంకర్ సర్ అద్భుతంగా నటించారు. సినిమా అంతా కూడా ఒకే టెంపోలో ఉంటుంది. సంజన గారు చాలా చక్కగా నటించారు. ప్రియా హెగ్డే గారు బాగా నటించారు. మా సినిమాను త్వరలోనే రిలీజ్ చేయబోతోన్నాం. ఇలానే మా సినిమాకు సపోర్ట్ అందిస్తారని అశిస్తున్నాను’ అని అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది. ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకుడిని లీనమయ్యేలా ఉంటుంది. సినిమా రెడీగా ఉంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు. చాలా త్వరగానే సినిమాను పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమాను నిర్మించాను. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా మా సినిమాకు సంగీతం అందించాడు. మా డీఓపీ జేపీ గారుఎంతో సహకరించారు. ‘ అని అన్నారు.

డైరెక్టర్ జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌ మాట్లాడుతూ.. ‘సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మంచి సంగీతాన్ని అందించారు. ఇదే టీంతో మళ్లీ ఇంకో సినిమాను చేస్తున్నాం. మనిషికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఏ మనిషీ హీరోగా పుట్టలేదు.. విలనిజం కూడా ఉంటుంది. ఈ కథలో హీరోలు, విలన్స్ ఎవరు అని ఉండదు. కథను అర్థం చేసుకున్న వారినే ఇందులో తీసుకోవాలని అనుకున్నాను. శంకర్‌గారు కథ విన్న వెంటనే సోల్ పట్టేసుకున్నారు. సంజన గారు పోషించిన పాత్రలోనూ చాలా డైమన్షన్స్ ఉన్నాయ్.. అందుకే ఆమెను ఆ కారెక్టర్ కోసం అడిగాం. ప్రియా హెగ్దే, చాణ‌క్యలు పోషించిన పాత్రలు కూడా బాగుంటాయి. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. సినిమాను ఓ ఆడియెన్‌గా చూశాను. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మీడియానే ఈ సినిమాను ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లాలి. జనవరి మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. పాటలు, ఫైట్స్ కూడా కథలో భాగంగానే వస్తాయి. రెండు గంటలు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

సంజన గల్రానీ మాట్లాడుతూ.. ‘కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబి గారికి థాంక్స్. శివ కంఠమనేని గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. చక్కగా నటించారు. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు. ఈ చిత్రయూనిట్‌తో పని చేయడం నాకు ఆనందంగా ఉంది. సినిమాకు మీకు నచ్చితే అందరూ మాకు సపోర్ట్ చేయండి’ అని అన్నారు.