శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే, సుమన్, భానుచందర్, తిలక్, గిరి, సోనియా చౌదరి తదితరులు నటించిన చిత్రం ‘నువ్వే నా ప్రాణం’. ఈ చిత్రానికి నిర్మాత శేషు మలిశెట్టి. మణిజెన్నాసంగీతాన్ని అందించగా.. నేపథ్య సంగీతం: రాజా, ఫైట్స్: మల్లి సమకూర్చారు. టీజర్, ట్రైలర్, పాటలతో ఇటీవల కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన చిత్రం ఇది. ఆదిత్య ఆడియో ద్వారా విడుదలైన`నువ్వే నా ప్రాణం`లోని ప్రతి పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, ఇన్ స్టా రీల్స్ లో పాటలు వైరల్ అయ్యాయి. దీంతో సినిమాపై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం అంచనాలకు అనుకుందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..!
కథలోకి.. గైనకాలజిస్ట్ అయిన కిరణ్మయి( ప్రియా హెగ్డే)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు ఐపియస్ ఆఫీసర్ అయిన ( హీరో కిరణ్ రాజ్) సంజు. కిరణ్మయిని ప్రేమలో పడేయడానికి నానా తంటాలు పడి తన మనసును గెలుచుకుంటాడు సంజు. ఇరు కుటుంబాల ఒప్పందంతో పెళ్లి చేసుకుంటారు. ఇలా చాలా సాఫీగా సాగిపోతున్న సంజు జీవితంలోకి కొంత మంది తీవ్రవాదులు ఎంటరవుతారు. ఈ క్రమంలోనే సంజుకి, కిరణ్మయికి మధ్య మనస్పర్థలు వచ్చి అవి విడాకులు వరకు దారి తీస్తాయి. అంతగా ప్రేమించిన సంజు…కిరణ్మయిని ఎందుకు కాదనుకుంటాడు? అసలు ఆ తీవ్రవాదులు సంజు వెంట ఎందుకు పడుతున్నారు? చివరకు సంజు, కిరణ్మయి ఒకటవుతారా? లేదా? తెలియాలంటే `నువ్వే నా ప్రాణం` చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ : దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా మలిచి, ఆద్యంతం అన్నివర్గాల ప్రెకషకులు సంతృప్తి పడేలా తెరకెక్కించాడు. అందుకు ముందుగా దర్శకుడి గట్స్ ని బాగా మెచ్చుకోవాలి. సినీ పరిశ్రమలో ఎటువంటి అనుభవం లేకుండా ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి..దాన్ని విజయవంతంగా విడుదల చేయడమంటే మాటలు కాదు.. చేతలు కావాలి. అలాంటి చేతలతో ముందుకు వచ్చి చిత్రాన్ని చేసినందుకు సెహబాష్ అనాల్సిందే. యువత ఆలోచనలు, హైఫై ఫ్యామిలీస్ వింత పోకడలు తెరపై చూపించే ప్రయత్నం చేస్తూనే..ఒక స్వఛ్చమైన ప్రేమకథని అంతే స్వచ్ఛంగా చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు. నూటికి నూరుపాళ్లు విజయాన్ని సాధించారు. కొత్త దర్శకుడైనా తను చెప్పాలనుకున్నది ఎక్కడా తడబడకుండా సూటిగా చెప్పారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగేలా రూపొందించి ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. ఎక్కడో ఒకటి..రెండు చోట్ల తప్ప సినిమా చూసే ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీలవ్వకుండా నడిపించారు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా మంచి లవ్ స్టోరీగా ఎంటర్ టైన్ చేస్తూ సెకండాఫ్ లో అందర్నీ ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది. సెకండాఫ్ గాడి తప్పింది అనుకునే లోపే ప్రీ క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఇచ్చి అందర్నీ షాక్ కు గురి చేశారు దర్శకుడు. కొత్త కథ కాకున్నా…తన బ్రిలియంట్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆడియన్స్ ని మెప్పించాడు.
నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే.. లవర్ బాయ్‌గా, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ రాజ్ పర్ఫక్ట్ గా యాప్ట్ అయ్యాడు. కన్నడ నటుడు అయినా అచ్చమైన తెలుగు కుర్రాడుగా ఒదిగిపోయాడు. తన పర్ఫార్మెన్స్, డాన్స్, ఫైట్స్ అన్నీ బాగా కుదిరాయి. అలాగే కన్నడ హీరోయిన్ అయిన ప్రియా హెగ్డే కూడా గైనకాలజిస్ట్ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె అందం, అభినయం రెండూ ఆకట్టుకుంటాయి. సుమన్, భానుచందర్, తిలక్ ఎప్పటిలాగే వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరును పరిశీలిస్తే… నువ్వే నా ప్రాణం చిత్రానికి పాటలు హైలైట్ అని చెప్పవచ్చు. పాటలన్నీ కూడా వినడానికి, చూడటానికి బావున్నాయి. ఆర్.ఆర్ బావుంది. ఫైట్స్ ఓకే. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా కథకు కావాల్సినంత ఖర్చు పెట్టారు. అందుకే చిత్రం చూడముచ్చటగా ఉంది.
ఫైనల్ గా చెప్పాలంటే.. ఇటీవల కాలంలో ఇలాంటి లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలు రాలేదనే చెప్పాలి. యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడా వల్గారిటీ లేకుండా చక్కటి పాటలు, చక్కటి హీరో హీరోయిన్ల జంట, కలర్ ఫుల్ సినిమాటోగ్రఫీ , అర్ధవంతమైన మాటలతో ‘నువ్వే నా ప్రాణం’ చిత్రం ఆకట్టుకుంటుంది. గో అండ్ వాచ్..డోంట్ మిస్.
రేటింగ్: 3/5