వ్యక్తిగత జీవితంపై కామెంట్లేస్తే కేసులు పెడతా: హెచ్చరించిన లక్ష్మీపార్వతి.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి (మొదటి భార్య బసవతారకం మరణించిన చాలా ఏళ్ళకు లక్ష్మీపార్వతిని వివాహమాడారు ఎన్టీయార్) ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నారు. ఆమె చాలాకాలంగా వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఆమెకు కీలకమైన పాత్ర ఇవ్వడంతోపాటుగా, నామినేటెడ్ పోస్ట్ (తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్) కూడా ఇచ్చారు వైఎస్ జగన్.

ఇక, స్వర్గీయ ఎన్టీయార్ వ్యక్తిగత జీవితం తెరచిన పుస్తకమే. ఎప్పుడైతే లక్ష్మీపార్వతి, ఎన్టీయార్ జీవితంలోకి ప్రవేశించారో.. ఆ తర్వాతి నుంచే నందమూరి కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయ్. చివరికి అది టీడీపీ నుంచి స్వర్గీయ ఎన్టీయార్‌ని బయటకు గెంటేసేదాకా వెళ్ళింది. ఎన్టీయార్ చివరి రోజుల్లో అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొన్నదీ లక్ష్మీపార్వతితో రెండో వివాహం, తాను స్థాపించిన టీడీపీ నుంచి గెంటివేయబడటమే.!

ఆనాటి ఆ రాజకీయ వెన్నుపోటు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్టీయార్ మరణించి కూడా చాలా ఏళ్ళయ్యింది. ఇప్పటికీ, ఆ గాయాలు మానలేదంటారు లక్ష్మీపార్వతి. పదే పదే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటారామె. దానికి కౌంటర్ ఎటాక్ తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుంటుందనుకోండి.. అది వేరే సంగతి.

కేవలం స్వర్గీయ ఎన్టీయార్‌ని వివాహమాడిన కారణంగా లక్ష్మీపర్వతిపై నందమూరి కుటుంబం కక్షగట్టిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ మహిళ విషయంలో టీడీపీ ఇంతటి హేయమైన చర్యలకు దిగడమా.? అన్న చర్చ తరచూ జరుగుతుంటుంది.

తాజాగా లక్ష్మీపార్వతి, తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లేసేవారిపై చట్టపరమైన చర్యలకు పూనుకుంటానని హెచ్చరించారు. ‘రాజకీయంగా మీరేమైనా విమర్శించుకోండి.. నా వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం గురించి విమర్శిస్తే ఊరుకునేది లేదు..’ అంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించడం గమనార్హం. ‘మరి, మా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తావా.?’ అంటూ టీడీపీ మహిళా నేతలు అప్పుడే కౌంటర్ ఎటాక్‌కి దిగుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.