అల్లుడిగారి ఆస్తులపై విచారణ కోసం కోర్టెకెక్కారు అత్తగారు.! కానీ, కోర్టులో అత్తగారికి షాక్ తగిలింది. ఆ అల్లుడుగారేమో నారా చంద్రబాబునాయుడైతే, అత్తగారేమో లక్ష్మిపార్వతి. నేరుగా లక్ష్మీపార్వతి, చంద్రబాబుకి అత్తగారేమీ కాదు. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ రెండో భార్య కదా.? అందుకే ఆ స్వర్గీయ ఎన్టీయార్‌కి అల్లుడైన చంద్రబాబు, లక్ష్మిపార్వతికి కూడా అల్లుడయ్యారు.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులాగానే, చంద్రబాబు అక్రమాస్తుల కేసు కూడా.. అన్నట్లు లక్ష్మీపార్వతి అనుకున్నారు. వైసీపీ ప్రోద్భలంతో న్యాయపోరాటం ఉధృతం చేయాలనుకున్నారు. వ్యవహారం హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకీ వెళ్ళింది. చివరికి సర్వోన్నత న్యాయస్థానం లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ కొట్టిపారేసింది.
‘ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలి.?’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించిందట. ఈ ప్రశ్న వచ్చాక లక్ష్మిపార్వతి మైండ్ బ్లాంక్ అయిపోయి వుండొచ్చన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ‘లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదు’ అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందట. ‘ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరు..’ అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించిందట కూడా.
ప్రజా జీవితంలోకి వచ్చాక, రాజకీయ నాయకుల ఆస్తుల గురించి ప్రజలు తెలుసుకోవడం తప్పెలా అవుతుంది.? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఎవరి గోల వారిది.!
రెండెకరాల చంద్రబాబు, రెండు లక్షల కోట్లు సంపాదించారన్నది వైసీపీ ఆరోపణ. ఈ క్రమంలో చంద్రబాబు మీద నానా రకాలుగా రాజకీయ దాడి చేస్తూ వచ్చింది వైసీపీ. చంద్రబాబు ఆస్తులు బహిరంగ రహస్యమే. కానీ, దేనికీ లెక్క వుండదు. అది చంద్రబాబు తెలివి. ఇలాంటి కేసుల నుంచి ఆయన తేలిగ్గానే తప్పించుకోగలుగుతారు. అలాగని, ఆయన్ని సుద్దపూస అనగలమా.?