కేసీయార్‌ని కూడా మర్యాదపూర్వకంగా కిషన్ రెడ్డి కలుస్తారా.?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ని ఆయనెందుకు ఇప్పటిదాకా అలా కలవలేదు.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, భారతీయ జనతా పార్టీకీ మధ్య వున్న సన్నిహిత సంబంధాన్ని జగన్ రెడ్డి – కిషన్ రెడ్డిల భేటీ నిరూపించిందనే చర్చ ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది. ‘రెడ్డి’ రాజకీయం.. అనే విమర్శ కూడా వైసీపీ, బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది. రాజకీయాల్లో ఈ తరహా విమర్శలు సర్వసాధారణమే అయినా, అవి అవాంఛనీయం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తమ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆహ్వానం పలకడం అనేది అత్యంత మర్యాదపూర్వకమైన అంశం. కిషన్ రెడ్డి గతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడాయన క్యాబినెట్ ర్యాంకు పొందారు.

అలా క్యాబినెట్ ర్యాంక్ దక్కాక తొలిసారి ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళారు గనుక, ఆయన చేసింది రాజకీయ పర్యటన అయినాగానీ, మర్యాదపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నిజానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కిషన్ రెడ్డిని ఇలాగే గౌరవించి వుండాల్సిందే. కానీ, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం చాలా తీవ్రస్థాయిలో వుంది. కిషన్ రెడ్డి స్వయంగా, తెలంగాణ రాష్ట్ర సమితిపై రాజకీయ యుద్ధం చేస్తున్నారాయె.. తనదైన స్టయిల్లో. దాంతో, సహజంగానే టీఆర్ఎస్ – బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అందుకేనేమో, కిషన్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంకు దక్కినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ లైట్ తీసుకున్నారు. ఇదిలా వుంటే, ఏపీలో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఎలా విమర్శలు చేశారో, అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వంపైనా తెలంగాణలో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. అయితే, ఏపీలో కాస్త తీవ్రత తక్కువ.. ఇక్కడ ఆ విమర్శల తీవ్రత చాలా చాలా ఎక్కువ.. అంతే తేడా.