ఆంధ్రప్రదేశ్ లో మరో ఎయిర్ పోర్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన నూతన విమానాశ్రయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం.. ఇదివరకు కర్నూలు నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు లేదా రైలులో వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు విమానాల్లో వెళ్లే అవకాశం కలిగిందని అన్నారు. రాష్ట్రంలో 6వ విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో న్యాయరాజధాని కానున్న కర్నూలుకు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలతో అనుసంధానించడానికి ఓర్వకల్లు విమానాశ్రయం వారధిగా ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ఎన్నికలకు నెలరోజుల సమయం ఉందనగా.. ఓట్ల కోసం.. అసలు పనులే పూర్తిగానీ ఎయిర్ పోర్టును ప్రారంభించారని జగన్ విమర్శించారు.
కేవలం ఎన్నికల్లో లబ్ధికోసం చంద్రబాబు రిబ్బన్ కటింగ్ చేశారంటూ జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిర్ పోర్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు జగన్ తెలిపారు. ఎయిర్ పోర్టును అధునాతన హంగులతో నిర్మించామన్నారు. ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీ కేర్, మెడికేర్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఏటీసీ, డీజీసీఏ అనుమతులు రప్పించడంలో మంత్రి, అధికారులు చక్కగా పనిచేశారని సీఎం అభినందించారు. ఎయిర్ పోర్టుకు మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్వతంత్ర్య పోరాటాన్ని సీఎం గుర్తు చేశారు. మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. 1915లో మహాత్మాగాంధీ ఇండియాకు తిరగివచ్చి 1917లో సత్యాగ్రహం ప్రారభించారన్నారు. వీటన్నింటికంటే ముందు కర్నూలు గడ్డమీద మొదటి స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైందని గుర్తు చేశారు.
1957లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కంటే ముందే 1847లోనే మహా స్వాతంత్ర్య సమరయోధుడు.. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆయనను గౌరవిస్తూ, నివాళులర్పిస్తూ కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కర్నూలుకు 18కిలో మీటర్ల దూరంలోని ఓర్వకల్లులో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు సంకల్పించింది. వెయ్యి ఎకరాల్లో నిర్మించిన ఎయిర్ పోర్టుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత మూడేళల్లో టెర్మినల్ నిర్మాణం పూర్తైంది. కానీ ఎయిరో డ్రోమ్ అనుమతులు మాత్రం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 2020లోనే 150 కోట్లు ఖర్చు చేసి రన్ వే, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసింది.