హైదరాబాద్ :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ ముందస్తు వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లడం టీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదు. సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగానే.. రెండేళ్ల క్రితం అసెంబ్లీకి ముందుస్తు ఎన్నికలకు వెళ్లింది టీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో గతంతో పోల్చితే ఎక్కువ స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇదే అంశంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. పార్టీ శ్రేణులకు, నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
గ్రేటర్‌కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశమైన కేటీఆర్.. పలువురు సిట్టింగ్ కార్పొరేటర్ల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని వ్యాఖ్యానించారు. పని తీరు మార్చుకోవాలని ఆయన ఒకింత హెచ్చరించారు. సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ వారికి క్లారిటీ ఇచ్చారు.
జీహెచ్ఎంసీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి కార్పొరేటర్లు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో మాత్రమే కోతలు విధించామని.. ఇతర రాష్ట్రలకు చీరలను సప్లై చేసే స్థాయికి మన నేతన్నలు ఎదగడం గర్వకారణమన్నారు. చేనేతల కోసం వివిధ పథకాలు తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయన్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళా సంఘాల ద్వారా అక్టోబర్ 9 నుంచి చీరల పంపిణీ చేస్తామన్నారు. చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ పరిధిలోని 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని కేటీఆర్ కామెంట్ చేయడం ఆ పార్టీ నేతల్లో కలవరం రేపుతోంది. కేటీఆర్ ప్రస్తావించిన ఆ 15 మంది ఎవరనే దానిపై నేతలు ముఖ్యనేతల దగ్గర ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ సమయంలో కేటీఆర్ 15 మంది నేతల గురించి ప్రస్తావించడంతో.. వారికి వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేటీఆర్ వారికి ముందుస్తుగా ఈ రకమైన సంకేతాలు ఇచ్చి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. కేటీఆర్ చెప్పిన 15 మంది కార్పొరేటర్లలో తమ పేరు ఉందా అని కొందరు నేతలు టెన్షన్ పడిపోతున్నారని సమాచారం. మొత్తానికి 2016లో జరిగిన 99 స్థానాలు దక్కించుకుని సొంతంగానే బల్దియా మేయర్ సీటును సొంతం చేసుకున్న టీఆర్ఎస్.. ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో సీట్లను సాధించాలనే ఆలోచనతో వ్యూహరచన చేస్తోంది.