ఏపీతోనే కాదు… అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతాం: కేటీఆర్

Ktr comments on Krishna River Water Dispute

కృష్ణా నదీ జలాల వివాదంపై తాజాగా మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కృష్ణా నదీ జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తమకు రావాల్సిన నీటి కేటాయింపుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తోనే కాదు… అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అన్నారు.

Ktr comments on Krishna River Water Dispute

కేటీఆర్ శనివారం నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరిక మేరకు రూ.10 కోట్లతో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు శ్రీకారం చుడుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని వివరించారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ చెట్ల‌ను పెంచి ముందు త‌రాల‌కు మంచి భ‌విష్య‌త్‌ను అందివ్వాలని ఆయన కోరారు.

అంతకు ముందు కేటీఆర్ కు విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. శనివారం నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ ను అడ్డుకునేందుకు ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు ప్ర‌య‌త్నించారు. అయితే, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో టీఆర్ఎస్ స‌ర్కారు నిర్ల‌క్ష్య ధోర‌ణిని విడనాడాల‌ని వారు నినాదాలు చేశారు.