కోవిడ్ ‘నాటు మందు’: కృష్ణపట్నం కథ కంచికి చేరేదెప్పుడు.?

Krishnapatnam Natu Mandu

Krishnapatnam Natu Mandu

సంబంధిత విభాగాల నుంచి అనుమతులు వస్తే, ప్రభుత్వం తరఫున మందుని పంపిణీ చేయడానికి సిద్ధంగా వున్నామని అధికార పార్టీ నేతలు ప్రకటించేస్తున్నారు. కీలకమైన పదవుల్లో వున్న నాయకులు ఇంత ధైర్యంగా ప్రకటనలు చేసేస్తున్నారంటే, ఆ మందుకి ‘కరోనా వైరస్’ని అడ్డుకునే శక్తి వుందనే భావించాలి. కానీ, ఆ మందుకి ఎప్పుడు అనుమతులొస్తాయో ఎవరికీ తెలియదు. మరోపక్క, నల్ల బజారులో మాత్రం ఈ మందుకి భలే గిరాకీ పలుకుతోంది. ఏకంగా పాతిక వేల రూపాయలు ఖర్చు చేశాడో ప్రభుద్ధుడు ఈ నాటు మందు కోసం. ఏం లాభం.? మోసపోయాడు.. ఆ మందు అతనికి దక్కలేదు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య, తాను తయారు చేసిన నాటు మందుతో కరోనా వ్యాధిని నయం చేయవచ్చని చెప్పడం, దానికి అధికార పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మద్దతు వుండడంతో, తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా ఈ మందుకి విపరీతమైన ప్రాచుర్యం లభించిన సంగతి తెలిసిందే. ‘అది అసలు మందు కాదు.. దాన్ని వాడితే కొత్త సమస్యలొస్తాయి.. ప్రాణాంతకం కూడా కావొచ్చు..’ అని కొందరు మేధావులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆయుష్ విభాగం ఇప్పటిదాకా ఈ మందుపై జరిగిన పరిశోధనల్లో ప్రాథమికంగా ఎలాంటి నష్టం ఈ మందు వల్ల వుండబోదని తేల్చింది.

లాభాల గురించి మాత్రం ఎవరూ స్పష్టతనివ్వడంలేదు. నష్టం లేదు కాబట్టి, ఎవరిష్టం వారిది.. అన్న కోణంలో ఈ మందుని జనంలోకి తీసుకెళ్ళడానికి అధికార వైసీపీ అత్యుత్సాహం చూపుతున్న మాట వాస్తవం. అసలు ఏదన్నా మందు పనిచేస్తుంది.. అని తేలాకనే కదా, జనంలోకి తీసుకెళ్ళాలనే ఆలోచన చేసేది. కృష్ణపట్నం నాటు మందు చుట్టూ ఏదో జరుగుతోంది. అది పొలిటికల్ స్టంట్ మాత్రమేనా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలు వున్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. సైన్సుకి అందని ఎన్నో అద్భుతాలు మన మధ్యనే వున్నాం. కానీ, వాటిని నమ్మాలంటే కష్టం. 60 శాతం మందిలో టీకా పనిచేస్తుంది.. అని తెలిస్తే, మిగతా 40 శాతం మంది గురించి ఆలోచించం. అదే నాటు మందు విషయంలో అయితే నానా రచ్చా షురూ. ఇదే కలికాలం.