వైసీపీకి దూరమవుతున్న కృష్ణపట్నం ఆనందయ్య.?

Krishnapatnam Anandaiah Politics

అనూహ్యగా దూసుకొచ్చిన ఆ పేరు మళ్ళీ తెరమరుగవుతోంది. అధికార వైసీపీ ఇచ్చిన పాపులారిటీతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నాటు వైద్యుడు ఆనందయ్య పేరు మార్మోగిపోయింది కొన్నాళ్ళ క్రితం. అప్పట్లో ఆయన ఇచ్చే నాటు మందు కోసం జనం పోటెత్తారు. అంతలోనే, ఆనందయ్య నాటు మందు తయారీ నిలిచిపోయింది.

తెరవెనుకాల రహస్యంగా మందు తయారీ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. నానా రకాల వివాదాల నడుమ, కోర్టు జోక్యంతో ఆనందయ్య నాటు మందు తయారీకి లైన్ క్లియర్ అయ్యింది. వైసీపీ నేతలు కొందరు, ఆనందయ్యను ప్రోత్సహించారు.. ఆనందయ్య పేరుతో పబ్లిసిటీ స్టంట్లు కూడా చేశారు. ఇక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది. ఆనందయ్య, ప్రభుత్వానికి దూరమయ్యారు. ప్రభుత్వం తనకు సహకరించడంలేదని ఆరోపించడం మొదలెట్టారు ఆనందయ్య.

ప్రభుత్వం సహకరించకపోతే తానే రంగంలోకి దిగుతానంటూ తాజాగా ‘డెడ్ లైన్’ కూడా పెట్టేశారు ఆనందయ్య. ప్రభుత్వ సహకారం లేకుండా ఆనందయ్య, రాష్ట్రమంతటా తాను తయారు చేసిన మందుని పంచగలరా.? కష్టమైన వ్యవహారమే అది. పైగా, ఆనందయ్య మందు వల్ల కరోనా సోకలేదనిగానీ, సోకిన వ్యక్తులు కరోనా తగ్గిందనిగానీ చెప్పడంలేదు. దాంతో, ఈ మందుకి గతంలో ఏర్పడ్డ క్రేజ్ ఇప్పుడు లేకుండా పోయిందన్నది నిర్వివాదాంశం.

ఇదిలా వుంటే, తనకు మాత్రమే సొంతమవ్వాల్సిన పేరు ప్రఖ్యాతుల్ని కొందరు సైడ్ లైన్ చేస్తున్నారన్న అక్కసు ఆనందయ్యలో పెరిగిపోయందనీ, అహంకారంతో ఆయన విర్రవీగుతున్నారనీ చర్చ జరుగుతోంది. టీడీపీ అనుకూల మీడియా ఆయనకు ఇస్తున్న ప్రత్యేకమైన ప్రాధాన్యత కారణంగా వైసీపీ, ఆయన్ని లైట్ తీసుకుందన్న వాదనలూ లేకపోలేదు. పాపులారిటీ పెరగడం, తగ్గడం ఈ రోజుల్లో చాలా చాలా చిన్న విషయాలంతే.